Breaking News

పెళ్లి పేరుతో యువకుడికి గాలం.. రూ.21లక్షలు దోచుకున్న దంపతులు


ఓ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌ పెట్టిన దంపతులు ఓ అమాయక యువకుడి నుంచి ఏకంగా రూ.21లక్షలు దోచుకున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. విజయవాడకు చెందిన కంపా హృదయానంద్‌ (30) 2017లో అనూష అలియాస్‌ హారిక(20)ను పెళ్లి చేసుకున్నాడు. హారిక అంతకుముందు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కొద్దిరోజులకే విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత హృదయానంద్‌ అనారోగ్యానికి గురికావడంతో ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో హారిక హైదరాబాద్‌లోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో ఉద్యోగంలో చేరింది. వచ్చే సంపాదనతో తృప్తి చెందని ఈ దంపతులు ఆన్‌లైన్ మోసాలకు తెరదీశారు. హారికా హృదయానంద్‌ పేరిట ఓ ఫేక్‌ ప్రొఫైల్‌ తయారుచేసి గుర్తుతెలియని అందమైన యువతి ఫొటోతో ఇండియన్‌ డేటింగ్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దాన్ని చూసిన నేరెడ్‌మెట్‌కు చెందిన డోనాల్డ్‌ హోరసీస్‌ రోజారియో అనే యువకుడు చాటింగ్‌ మొదలెట్టాడు. హృదయానంద్‌ తాను యువతినని భ్రమింపజేస్తూ రోజూ అతడితో చాటింగ్‌ చేసేవాడు. కొద్దిరోజుల తర్వాత గుండె జబ్బుతో బాధపడుతున్న తన తల్లి ఆపరేషన్‌కు డబ్బు సాయం చేయాలని కోరగా రోజారియో ఆన్‌లైన్లో కొంత మొత్తం పంపించాడు. కొద్దిరోజుల తర్వాత తన తల్లి చనిపోయిందని, తన అక్కకు ఎమర్జెనీగా సర్జరీ చేయించాలని చెప్పి పలుమార్లు అతడి నుంచి డబ్బులు గుంజాడు. ఇలా రోజారియో అనేక విడతలుగా మొత్తం రూ.21లక్షలు పంపించాడు. ఆ తర్వాత పెళ్లిని వాయిదా వేస్తూ ఏవో కారణాలతో డబ్బులు అడుగుతుండటంతో అనుమానం వచ్చిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు విజయవాడకు వెళ్లి నిందితులను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. పెళ్లి విషయంలో జరిగే ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ నెటిజన్లకు సూచించారు.


By January 02, 2021 at 08:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vijayawada-couple-arrested-for-cheating-rs-21-lakhs-on-pretext-on-marraige/articleshow/80067353.cms

No comments