Breaking News

బైడెన్ బృందంలో 20 మంది భారతీయులు.. 17 మందికి శక్తివంతమైన బాధ్యతలు


అమెరికాకు 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత మరో మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ తన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే, బైడెన్ యంత్రాంగంలో ఏకంగా 20 మంది భారత సంతతి అమెరికన్లకు చోటు దక్కగా.. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అమెరికా జనాభాలో భారత సంతతి వాటా ఒకశాతం కంటే తక్కువే అయినా, అగ్రరాజ్యం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్‌ తన బృందంలో పెద్దపీట వేశారు. అలాగే, తన టీమ్‌లో వివిధ మూలాలున్న వ్యక్తులకు అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనే భారతీయ అమెరికన్లకు తన బృందంలో పెద్దపీట వేయనున్నట్లు బైడెన్‌ సంకేతాలిచ్చారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ను ఎంపికచేసి, అందర్నీ బైడెన్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఎంపిక ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం భారతీయ అమెరికన్లే కాదు, ఆసియా సంతతి మొత్తం బైడెన్ వెంట నిలిచింది. ఇదిలా ఉండగా.. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ కూడా జనవరి 20నే బైడెన్‌తో పాటు బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలే కాదు.. ఆ పదవిని చేపట్టబోయే తొలి భారత సంతతి వ్యక్తి, ఏషియన్‌ అమెరికన్‌ కావడం విశేషం. బైడెన్‌ బృందంలో భారతీయ అమెరికన్‌ నీరా టాండన్‌ ‘ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌’ డైరెక్టర్‌గా, అమెరికా సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్‌ మూర్తి వ్యవహరించనున్నారు. వీరితో పాటు బైడెన్‌ పాలక వర్గంలో మరికొందరికి కీలక పదవులు దక్కాయి. మొత్తం 20 మంది భారతీయ అమెరికన్‌లలో 17 మంది వైట్‌హౌస్‌లో శక్తివంతమైన పాత్ర పోషించనున్నారు. బైడెన్‌ స్పీచ్‌ రైటింగ్‌ బృందం డైరెక్టర్‌‌గా వినయ్‌ రెడ్డి, అధ్యక్షుడికి అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీ‌గా వేదాంత్‌ పటేల్‌, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ అటార్నీ జనరల్‌‌గా వనితా గుప్తా, స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో అండర్‌ సెక్రటరీగా ఉజ్రా జాయే, ప్రథమ మహిళ పాలసీ డైరెక్టర్‌‌గా మాలా అడిగా, ప్రథమ మహిళ ఆఫీస్ డిజిటల్‌ డైరెక్టర్‌‌గా గరీమా వర్మ, ప్రథమ మహిళ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ‌గా సబ్రీన్ సింగ్, వైట్‌హౌస్ డిజిటల్‌ ఆఫీస్ పార్టనర్‌షిప్‌ మేనేజర్‌‌గా అయిషా షా, నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌ డిప్యూటీ డైరెక్టర్‌‌గా సమీరా ఫజిలి, భరత్ రామ్మూర్తిని ఎంపిక చేశారు. డిప్యూటీ డైరెక్టర్‌, ఆఫీస్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్‌ రాఘవన్‌, టెక్నాలజీ అండ్‌ నేషనల్‌ సెక్యూరిటీ సీనియర్‌ డైరెక్టర్‌‌గా తరుణ్‌ ఛబ్రా, స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ సౌత్‌ ఏషియా విభాగం సీనియర్ డైరెక్టర్‌గా సుమోనా గుహ, విదేశాంగ విభాగంలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం విభాగం సమన్వయ కర్తగా శాంతి కలతిల్‌, క్లైమేట్‌ పాలసీ సీనియర్‌ అడ్వైజర్‌‌గా సోనియా అగర్వాల్, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల విభాగం పాలసీ అడ్వైజర్‌‌గా విదుర్‌ శర్మ, శ్వేతసౌధం అసోసియేట్‌ కౌన్సిల్‌‌గా శ్వేతా శర్మ, వైట్‌హౌస్ డిప్యూటీ అసోసియేట్‌ కౌన్సిల్‌‌గా రీమా షాలను నియమించారు.


By January 17, 2021 at 02:48PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-elect-joe-biden-ropes-in-20-indian-americans-in-administration/articleshow/80312852.cms

No comments