Breaking News

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. 2-1 మెజార్టీతో తీర్పు


కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం తీర్పు వెలువరించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం వాదనలతో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం 2-1 మెజార్టీతో తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి ఏకాభిప్రాయంతో తీర్పును రాయగా.. జస్టిస్ సంజీవ్ ఖన్నా విడిగా తీర్పు కాపీని రాశారు. దీంతో ధర్మాసనంలో మెజార్టీ న్యాయమూర్తులు సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్పు వెల్లడించినట్టయ్యింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై గతంలోనే విచారణ పూర్తిచేసిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. ప్రాజెక్టు డిజైన్, స్థలం కేటాయింపు, పర్యావరణ అనుమతులను సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనానికి కేవలం భూమిపూజ మాత్రమే నిర్వహించాలని, నిర్మాణం లేదా కూల్చివేత పనులు చేపట్టవద్దని కేంద్రానికి డిసెంబరు 7న సుప్రీంకోర్టు సూచించింది. కొత్త పార్లమెంట్, ప్రభుత్వ భవనాల ఆధునికీకరణకు సంబంధించి 2019 సెప్టెంబర్లో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టింది. ఈ భవనంలో 900 నుంచి 1,200 మంది పార్లమెంట్ సభ్యులు కూర్చునేందుకు వీలుగా.. త్రిభుజాకారంలో నిర్మించనున్నారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం(2022 ఆగస్టు 15) నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024లోపు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. 2020 డిసెంబర్ 10న పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ. 971 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ను నిర్మాణం చేపట్టనున్నట్టు లోక్సభ్ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.


By January 05, 2021 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-allows-central-vista-project-but-with-several-riders/articleshow/80109790.cms

No comments