Breaking News

తల్లికొడుకుల దారుణ హత్య: 16 కిలోల బంగారం చోరీ.. 4 గంటల్లోనే చేధించిన పోలీసులు


నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడి తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసి, 16 కిలోల బంగారాన్ని దుండుగులు దోచుకెళ్లిన ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. బుధవారం ఉదయం మైలాడుతురై జిల్లాలో జరిగిన ఈ చోరీ కేసును పోలీసులు నాలుగు గంటల్లో పోలీసులు ఛేదించారు. ఓ నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమవ్వగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. మైలాడుతురై జిల్లా సీర్కాళి, ధర్మకుళంలో స్థానిక రైల్వేరోడ్డుకు చెందిన ధన్‌రాజ్‌ చౌదరి అనే వ్యక్తి బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ధనరాజ్ ఇంటిలోకి చొరబడ్డారు. దుండగులు వ్యాపారి ఇంటి తలుపు తట్టడంతో ధన్‌రాజ్‌ వెళ్లి తలుపు తీశాడు. ఇంతలోనే ఆయనపై దాడి చేసి ఇంట్లోకి చొరబడి ధనరాజ్ భార్య ఆశ (48), కుమారుడు అఖిల్‌ (25)ను కత్తితో నరికారు. అడ్డుకోబోయిన ధనరాజ్ కోడలు నెహల్‌పైనా దాడి చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న 17 కిలోల బంగారం, సీసీటీవీ ఫుటేజ్ ఉన్న హార్డ్‌డిస్క్‌ తీసుకుని వ్యాపారి కారులో పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ధనరాజ్ భార్య, కుమారుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని ఆరా తీశారు. దుండగులను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మేలమాత్తూర్‌ ప్రాంతంలో కారు ఆగిపోవడంతో.. వారు వాహనం దిగి పొలాల్లోకి పారిపోతుండగా గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎరుక్కూర్‌ వద్ద ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి యత్నించగా.. పోలీసులపై దాడి చేశారు. దీంతో పోలీసుల కాల్పులు జరపగా మహిపాల్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. మనీష్‌ (23), రమేష్‌ పటేల్‌ (20) అనే మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు రాజస్థాన్‌కు చెందిన మరో నిందితుడు కర్నారామ్ కుంబకోణం వద్ద బుధవారం సాయంత్రం పట్టుబడ్డాడు. వారి నుంచి 16 కిలోల బంగారం, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణారామ్‌ అనే మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ధనరాజ్ చౌదరి స్వస్థలం రాజస్థాన్ కాగా.. సీర్కాళీలో స్థిరపడ్డారు. అఖిల్‌కు ఏడాది కిందటే వివాహం జరిగినట్టు పోలీసులు తెలిపారు. తొలుత లోనికి చొరబడిన నిందితులు.. ఇంటిలో ఉండే నగలన్నీ తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆశ, అఖిల్ గొంతు కోసి, మిగతావారిపై దాడి చేశారు. నిందితుల దాడిలో గాయపడిన నెహాల్ ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయడంతో వారు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులు ఉత్తరాదికి చెందిన నేరస్థులుగా భావిస్తున్నారు.


By January 28, 2021 at 12:14PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/gang-murders-two-of-family-during-burglary-in-tamil-nadu-police-chased-with-in-four-hours/articleshow/80495127.cms

No comments