Breaking News

క్యాపిటల్ భవనం హింస: నాలుగుకు చేరిన మృతులు.. వాషింగ్టన్‌లో 15 రోజుల ఎమర్జెన్సీ


అమెరికా క్యాపిటల్‌ భవనంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. ఘర్షణల్లో గాయపడిన మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వాషింగ్టన్‌ డీసీ పోలీసులు తెలిపారు. జో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు యూఎస్ కాంగ్రెస్ భవనంలోకి చొచ్చుకొచ్చారు. అమెరికా జెండాలు పట్టుకుని, ట్రంప్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ చొచ్చుకురావడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించడంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు. క్యాపిటల్‌ భవనంలో కాల్పుల ఘటన నేపథ్యంలో వాషింగ్టన్‌ డీసీలో మేయర్‌ మురియెల్‌ బౌజర్‌ కర్ఫ్యూ విధించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొందరు ఆంక్షలను ఉల్లంఘించి ఆందోళనలకు దిగారు. దీంతో నగర వ్యాప్తంగా 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 52 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల నేపథ్యంలో అధ్యక్షుడు ఖాతాను 12 గంటలు స్తంభింపజేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను 12 గంటలు లాక్ చేస్తామని పేర్కొన్న ట్విట్టర్.. భవిష్యత్తులో విధానాలను ఉల్లంఘిస్తే ఆయన అకౌంట్ శాశ్వతంగా నిలిపివేస్తామని హెచ్చరించింది. నియమాలకు విరుద్ధంగా ఉన్న పోస్ట్‌లను తొలగించాలని సూచించింది. అటు ఫేస్‌బుక్ సైతం ట్రంప్ అకౌంట్‌ను 24 గంటలపాటు స్తంభింపజేసినట్టు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ట్రంప్ పెట్టిన ఓ వీడియోను తొలగించింది. ఆందోళనకారులను భవనం లోపల నుంచి వెళ్లగొట్టడంతో నాలుగు గంటల హింసాత్మక ఘటనల తర్వాత యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశం మళ్లీ ప్రారంభమైంది. జో బైడెన్‌ గెలుపును వ్యతిరేకిస్తూ కొందరు రిపబ్లికన్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. అయితే, ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనం బయటే వేచి చూస్తున్నారు. భవనం బయట పార్టీ జెండాలు పట్టుకుని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.


By January 07, 2021 at 11:29AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/four-dead-52-arrested-as-donald-trump-supporters-occupy-us-capitol/articleshow/80147912.cms

No comments