Breaking News

టెంపోను ఢీకొట్టిన ఇసుక లారీ.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మహిళలు మృతి


కర్ణాటకలో శనివారం ఉదయం ఘోర సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు గాయపడ్డారు. హుబ్బళ్లి- ధార్వాడ్ జాతీయ రహదారిపై ఇత్తీస్‌గట్టి క్రాస్ రోడ్స్ వద్ద ప్రయివేట్ ట్రావెల్స్ వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో డ్రైవర్, అందులోని పది మంది మహిళలు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులు దేవనగరే నుంచి గోవాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ బెలగావి నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతులు తమ కుటుంబంలో జరిగే ఓ వేడుక కోసం వెళ్తున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను ప్రస్తుతం ఇత్తీస్‌గట్టి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ మార్గంలో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. చెన్నై-ముంబయి ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఉండే సింగిల్ లైన్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ మార్గాన్ని విస్తరించాలని చాలా కాలంగా డిమాండ్ కొనసాగుతోంది. కానీ, ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య వివాదం నేపథ్యంలో 2023 తర్వాత విస్తరణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


By January 15, 2021 at 10:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/11-die-after-truck-tempo-collision-near-dharwad-hubballi-highway-in-karnataka/articleshow/80279918.cms

No comments