To Let చూసి ఇంట్లోకి.. వృద్ధురాలి నోటికి ప్లాస్టర్ వేసి.. దారుణం
టు లెట్ బోర్డు చూసి అద్దెకు ఇల్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చారు. బ్యాంకు ఉద్యోగం చేస్తామంటూ ఇల్లు అద్దెకు అడిగారు. ఇంటి యజమానురాలు ఇల్లు చూపించేందుకు లోపలికి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా షాకిచ్చారు. ఆమె కాళ్లూచేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి తాపీగా చోరీ చేసుకెళ్లారు. మెడలోని బంగారం సహా ఇంట్లో ఉంచిన నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. కొద్దిసేపటికి పక్కింటోళ్లు గమనించడంతో వృద్ధురాలిని విడిపించారు. పట్టపగలే జరిగిన దోపీడీ ఘటన ఒంగోలులో కలకలం రేపింది. పట్టణంలోని మారుతీనగర్ రెండో లైన్‌లో కంచర్ల అనంతలక్ష్మి(70) నివాసముంటోంది. ఆమె భర్త కొన్నేళ్ల కిందట మరణించాడు. కూతురు వివాహమై దూరంగా ఉంటోంది. తన ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉండడంతో అనంతలక్ష్మి టూ లెట్ బోర్డు పెట్టింది. అది గమనించిన కేటుగాడు అద్దెకు ఇల్లు కావాలంటూ లోపలికి వచ్చాడు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నానని.. ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. ఆమె ఇంటి తలుపులు తీసి చూపిస్తుండగా మరో వ్యక్తి ఇంట్లోకి చొరబడ్దాడు. ఇద్దరూ కలసి ఆమెను అమాంతం లాక్కెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లూచేతులు కట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేసి కేకలు వేయకుండా జాగ్రత్తపడ్డారు. ఆమె మెడలో ఉన్న 12 సవర్ల బంగారు ఆభరణాలు, బీరువాలో దాచి ఉంచిన రూ.5 వేల నగదు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత పక్కింటి వారు వచ్చి చూసి ఆమెను విడిపించారు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్, టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By December 17, 2020 at 11:46AM
No comments