Breaking News

GHMC Elections: చివరి గంటలో భారీగా పెరిగిన పోలింగ్..? ఎలా..?


జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఓ సంచలన వాదనకు తెర తీశారు. ‘పోలింగ్ పర్సంటేజ్ ఏక్‌దమ్ పెరిగింది’ అంటూ ఓ తెలుగు దినపత్రిక వెలువరించిన ఓ కథనాన్ని ఆమె ట్వీట్ చేశారు. ఐదు గంటల తర్వాత అనూహ్యంగా పోలింగ్ పెరిగిందని.. చాలా చోట్ల ఆ గంట వ్యవధిలోనే 12 నుంచి 18 శాతం వరకు పోలింగ్ నమోదైందని ఆ పత్రిక కథనాన్ని వెలువరించింది. ఎన్నికల రోజున ఓటేయడానికి నగర వాసులు పెద్దగా ఆసక్తి చూపలేదని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం చూసినా పోలింగ్ మందకొడిగా సాగింది. పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లో కేవలం 3.1 శాతమే ఓటింగ్ నమోదైంది. 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదు కాగా.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 25.34 శాతం పోలింగ్ జరిగింది. 4 గంటల వరకు 29.76 శాతమే పోలింగ్ నమోదైంది. కానీ చివరి గంటలోనే ఓటింగ్ భారీగా పెరిగిందని తెలుస్తోంది. ఓటర్లు పెద్దగా క్యూలైన్లలో లేకున్నా.. సాయంత్రం వరకు పోలింగ్ బూత్‌లు ఖాళీగా దర్శనం ఇచ్చినా.. ఆరు గంటలు ముగిసే సరికి 46.6 శాతం పోలింగ్ నమోదైంది. చివరి గంటలో దాదాపు 9 శాతం పోలింగ్ జరగడంతో అవకతవకలు జరిగాయేమోనని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరగడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా అందినట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల తర్వాత భారీ ఎత్తును ఓటింగ్ జరిగితే.. లైవ్ వెబ్ క్యాస్టింగ్‌లో ఓటర్లు కనిపించాల్సి ఉండగా.. అలా జరగలేదని.. బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో జరిగిన ఎన్నిక కావడంతో.. అవకతవకలకు ఆస్కారం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక.. ఈ ఆరోపణలు మరింత బలంగా తెర మీదకు వస్తాయా..? లేదంటే వ్యవహారం సద్దుమణుగుతుందా? అనేది చూడాలి.


By December 03, 2020 at 02:04PM


Read More https://telugu.samayam.com/telangana/news/bjp-leader-dk-aruna-shares-a-media-report-on-increasing-ghmc-poll-percentage-in-last-one-hour/articleshow/79544851.cms

No comments