Breaking News

ఫ్రాన్స్‌లో కొత్తరకం కరోనా తొలి కేసు.. లండన్ నుంచి వ్యక్తిలో గుర్తింపు


బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతున్న స్ట్రెయిన్ ఐరోపాలోని పలు దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా, ఫ్రాన్స్‌లో కొత్తరకం కరోనా తొలి కేసు నమోదయ్యింది. ఈ మేరకు ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిటన్‌లో నివసిస్తున్న ఫ్రాన్స్ పౌరుడు.. లండన్ నుంచి డిసెంబరు 19న తమ దేశానికి వచ్చాడని,అతడిలో ఎటువంటి లక్షణాలు లేకపోయినా ఇంటి వద్దనే స్వీయ నిర్బంధంలో ఉన్నాడని పేర్కొంది. రెండు రోజుల తర్వాత డిసెంబరు 21న ఆస్పత్రికి తరలించి, పరీక్షించగా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ సోకినట్టు గుర్తించామని వివరించింది. ఆ వ్యక్తికి కొత్తరకం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతడితో కాంటాక్ట్ అయినవారిని గుర్తించే ప్రక్రియ చేపట్టినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో అతడికి చికిత్స కొనసాగుతోందని తెలిపింది. అతడు ఎవరినైనా కలిసినట్టు గుర్తించినా వారిని ఐసోలేషన్‌కు పంపుతామని వివరించింది. ఈ కేసుతో పాటు, కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఇతర కేసులను జాతీయ పాశ్చర్ ఇనిస్టిట్యూట్ ప్రత్యేక ప్రయోగశాలలో ‘VOC 202012/01’ వేరియంట్‌ను గుర్తించేందుకు నమూనాలను పంపినట్టు తెలిపారు. దేశంలోకి కొత్తరకం కరోనా ఇప్పటికే ప్రవేశించి ఉంటుందని నాలుగు రోజుల కిందట ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి ఓలీవియర్ వెర్నర్ వ్యాఖ్యానించారు. రోమ్‌లో కొత్తరకం కరోనా కేసును గుర్తించినట్టు ఇటలీ అధికార వర్గాలు వెల్లడించాయి. డెన్మార్క్‌లో తొమ్మిది, నెదర్లాండ్, ఆస్ట్రేలియాలో ఒక్కొక్కటి చొప్పున కొత్తరకం కరోనా కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బ్రిటన్‌లో కొత్త కరోనా విజృంభించడంతో ఆ దేశంతో సరిహద్దులను 48 గంటలపాటు మూసేస్తున్నట్టు ఈ వారం ఫ్రాన్స్ ప్రకటించింది. అయితే, తమ దేశంలో తొలి కేసు నమోదుకావడంతో జనవరి 6 వరకు ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.


By December 26, 2020 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/france-confirms-first-case-of-new-covid-variant-in-london-returnee/articleshow/79963779.cms

No comments