Breaking News

ప్రాణాలు తీసిన పొగమంచు: కంటెయినర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి


పొగమంచు కారణంగా రహదారి కనిపించక ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సంభాల్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. మొరాదాబాద్-ఆగ్రా జాతీయ రహదారిపై ధనారీ పోలీస్‌ స్టేషన్ పరిదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ బస్సు.. పొగ మంచు వల్ల ఎదురుగా వస్తున్న ఓ భారీ ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను బస్సులోని నుంచి బయటకు తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సంభాల్ ఎస్పీ చక్రేశ్ మిశ్రా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ఆయన తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది వరకు గాయపడినట్టు పేర్కొన్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదం తర్వాత భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో రెండు వాహనాలు ఒకదానిలో ఒకటి ఇరుక్కున్నాయి. క్రేన్ సాయంతో వాహనాలను వేరుచేసి, అతికష్టంమీద మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోకి ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. మృతులతంతా బస్సులోని ప్రయాణికులేనని వివరించారు.


By December 16, 2020 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-seven-killed-road-accident-due-to-bus-collided-with-container-in-sambhal/articleshow/79753823.cms

No comments