Breaking News

బురేవి తుఫాను.. నేడు, రేపు తమిళనాడులో భారీ, ఏపీలో ఓ మోస్తరు వర్షాలు


ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది తమిళనాడులోని రామనాథపురానికి నైరుతిలో 40 కిలోమీటర్లు, పంబన్‌కు పశ్చిమనైరుతి దిశగా 70 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. రామనాథపురం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో శనివారం తమిళనాడులోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడలూర్‌ జిల్లాల్లో అతిభారీలకు వరద పోటెత్తి సుమారు 80 వేల ఇళ్లు జలమయమయ్యాయి. 50 గ్రామాలకు వెళ్లే రహదారులు దెబ్బతినడంతోపాటు లక్ష ఎకరాల్లో పంట నీట మునిగింది. అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాలు తమిళనాడులోని కడలూర్‌, అరియలూర్‌, మైలాడుదురై, నాగపట్టణం, తంజావూర్‌, తిరువారూర్‌, కారైకల్‌ ప్రాంతాలు, పుదుచ్చేరిలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, విళ్లుపురం, తిరువణ్ణామలై, పుదుచ్చేరి ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలతో పాటు, తీరప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణ కేరళ, మహే, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో సోమవారం వరకు మోస్తరు వర్షాలు... ఒక్కోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. చిదంబరం నటరాజ స్వామి ఆలయంలోకి శనివారం కూడా ఐదడుగుల మేర నీరు చేరింది. బురేవి తుఫాను ప్రభావంతో చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నైలో సుమారు 5.3 లక్షల కుటుంబాలు గుడిసెలలో ఉండగా.. వాటిలోని మొత్తం 26 లక్షల మందికి ఆదివారం నుంచి డిసెంబరు 13 వరకు ఉచితంగా మూడు పూటలూ ఆహారం పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. సామాజిక భవనం, అమ్మా క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేయనుంది. అటు, దక్షిణ అండమాన్‌ సముద్రాన్ని అనుకుని, మాలే ద్వీపకల్ప ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల శనివారం వర్షాలు కురిశాయి. ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


By December 06, 2020 at 07:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyclonic-storm-burevi-weakened-into-well-marked-low-pressure-heavy-rain-fall-to-tamil-nadu-and-puducherry/articleshow/79587962.cms

No comments