Breaking News

కొత్తరకం కరోనా వ్యాప్తి: కేంద్రం మార్గదర్శకాలు విడుదల.. ఈ నిబంధనలు తప్పనిసరి


ఏడాదిగా ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంది. కొత్తరూపంతో మళ్లీ ప్రపంచాన్ని మరోసారి కలవరపెడుతోంది. బ్రిటన్‌లో కొత్త వైరస్ విజృంభించడంతో పలు దేశాలు అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం సైతం సిద్ధమైంది. యూకే నుంచి వచ్చే విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ‘కరోనా వైరస్‌లో వెలుగుచూసిన ఉత్పరివర్తనాల ద్వారా ఈ వైవిధ్యాన్ని నిర్వచిస్తున్నారు. ఇది అంటువ్యాధిగా మారి, వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది’ అని ఆరోగ్య మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో నవంబర్ 25- డిసెంబర్‌23 మధ్య యూకే నుంచి, ఆ దేశం మీదుగా వచ్చిన ప్రయాణికులను ఈ కొత్త మార్గదర్శకాల పరిధిలోకి చేర్చినట్టు తెలిపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం నవంబరు 25 తర్వాత విదేశాల నుంచి వచ్చినవారు తమ వివరాలను వెల్లడించాలి. విదేశీ ప్రయాణాలు చేసివారు వారి గత రెండు వారాల ప్రయాణ వివరాలను వెల్లడించాలి.. స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని నింపాలి. ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ అని నిర్ధారణ అయితే స్పైక్‌ జీన్‌కు సంబంధించిన ఆర్టీపీసీఆర్ పరీక్షకు సిఫార్సు చేస్తారు. ఇప్పటికే ఉన్న కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలితే..లక్షణాల తీవ్రతను బట్టి హోం ఐసోలేషన్‌లో ఉంచడం లేదా ఆసుపత్రి తరలిస్తారు. కొత్త రకం వైరస్ పాజిటివ్‌గా తేలితే.. బాధితుడికి ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్‌లో చికిత్స అందజేస్తారు. 14 రోజుల తరవాత మరోసారి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మరోసారి పాజిటివ్‌గా తేలితే 24 గంటల్లో రెండుసార్లు నెగిటివ్ వచ్చే వరకు నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. అలాగే కొత్త రకం కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తితో ప్రయాణించిన వారిని సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచాలి. చెక్‌ఇన్ సమయంలోనే ప్రయాణికులకు ఎస్‌ఓపీల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది. అలాగే యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సంబంధిత రాష్ట్రాలు, ఇంటిగ్రేటెడ్ డిసీజ్‌ సర్వైలెన్స్ ప్రొగ్రామ్‌కు అందించాలని తెలిపింది. ఐరోపా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఈసీడీసీ) అంచనా ప్రకారం.. స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాప్తిచెందుతుంది... యువతపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘వైరస్ 17 మార్పులు లేదా ఉత్పరివర్తనాల ద్వారా నిర్వచించిన ఈ వైవిధ్యం చాలా ముఖ్యమైన మార్పులలో ఒకటి… వైరస్ మరింత అంటువ్యాధిగా మారవచ్చు.. ప్రజలకు మరింత సులభంగా వ్యాప్తి చెందుతుంది’ అని పేర్కొంది. సంస్థాగత ఐసోలేషన్ ద్వారా పరీక్షించే ప్రయాణీకులను ఆయా రాష్ట్ర ఆరోగ్య అధికారుల సమన్వయంతో ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్‌లో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ‘ఐసోలేషన్, చికిత్స కోసం నిర్దిష్ట సౌకర్యాలను కేటాయించాలి... నమూనాలను పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ లేదా జన్యుసంబంధ సీక్వెన్సింగ్ కోసం ఏదైనా ఇతర ప్రయోగశాలకు పంపాలి’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.


By December 23, 2020 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-health-ministry-briefs-on-new-strain-of-coronavirus-issues-new-guidelines/articleshow/79910217.cms

No comments