Breaking News

ఐటీబీపీలో బుల్లి శునకాలకు నామకరణ మహోత్సవం.. ఏం పేర్లు పెట్టారంటే?


ఇండో టిబెటన్‌ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగం డాగ్‌ స్క్వాడ్‌లోని 17 కుక్కపిల్లలకు తాజాగా నామకరణోత్సవం నిర్వహించారు. హరియాణాలోని పంచకుల జాతీయ శునక శిక్షణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో బుల్లి శునకాలకు స్వదేశీ పేర్లను పెట్టారు. ఇక నుంచి శునకాలకు కేవలం భారతీయ పేర్లను మాత్రమే పెట్టాలని నిర్ణయించినట్టు డాగ్ టీమ్ కే9 పేర్కొంది. తాజాగా, బుజ్జి శునకాలకు సరిహద్దు ప్రాంతా ల పేర్లను సూచించడం విశేషం. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చరిత్రలోనే తొలిసారిగా డాగ్ స్క్యాడ్‌లోని శునకాలకు స్థానిక పేర్లను సూచించారు. కొద్ది నెలల కిందట పుట్టిన ఈ బుల్లి శునకాలకు అనే-లా, గల్వాన్‌, ససోమా, చిప్‌-చాప్‌, సాసెర్‌, శ్రీజప్‌, చార్డింగ్‌, రెజాంగ్‌, దౌలత్‌, సుల్తాన్‌-చుస్క్, ఇమిస్‌, రాంగో, యులా, ముఖ్‌ప్రీ, చుంగ్‌-తంగ్‌, ఖర్‌దుంగీ, శ్యోక్‌ అనే పేర్లను సిబ్బంది సూచించగా.. ఐటీబీపీ చీఫ్ ఎస్ఎస్ దెస్వాల్ వాటినే పెట్టాలని నిర్ణయించారు. ఈ కుక్క పిల్లలకు సరిహద్దుల్లోని గ్రామాల పేర్లను పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మలినాయిస్‌ జాతికి చెందిన ఈ కుక్కపిల్లలు, శిక్షణ అనంతరం ఐటీబీపీకి సేవలు అందించనున్నాయి. ‘కే9 డాగ్ టీమ్‌కి పశ్చిమ దేశాల పేర్లను సూచించే సంప్రదాయానికి ముగింపు పలికాం.. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చరిత్రలోనే తొలిసారిగా ఇండో టిబెటన్ బోర్డ్ పోలీస్ (ఐటీబీపీ) శునక యోధులకు స్థానిక పేర్లను సూచించాం.. దేశం కఠినమైన సరిహద్దులకు కాపలాగా ఉన్న అన్ని దళాలకు గౌరవంగా ఈ కుక్కపిల్లల పేరు పెట్టాం’ అని ఐటీబీపీ పేర్కొంది. ‘పంచకుల హరియాణా భాను-ఐటీబీపీ బీటీసీ శునకాల శిక్షణ కేంద్రంలో రెండు నెలల కిందట మగ కుక్కు గాలా- ఆడ కుక్కలు ఓలేషయా, ఓల్గాకు పుట్టిన సంతానానికి నామకరణ మహోత్సవం అధికారికంగా జరిగింది’ అని తెలిపింది. కే9 సైనికులకు 100 శాతం దేశీయ పేర్లను అదికూడా సరిహద్దుల్లో సైన్యం గస్తీ నిర్వహిస్తున్న ప్రాంతాల పేర్లు పెట్టడం ద్వారా స్వాతంత్ర్యం తరువాత తొలిసారి దేశంలోని K9 విభాగం తన స్వంత వారసత్వాన్ని, నీతిని అంగీకరిస్తుంది’ అని తెలిపింది. తదుపరి బ్యాచ్ శునకాలకు కారాకోరం నుంచి జెచప్ లా వరకు ఐటీబీపీ సైన్యం మోహరించి ఉన్న 3,488 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దుల్లోని మంచు ప్రాంతాల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నామకరణం జరిగిన శునకాలను తమకు అందజేయాలని ఇతర పారామిలటరీ బలగాలు ఐటీబీపీని కోరుతున్నాయి.


By December 31, 2020 at 08:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/only-indian-names-for-security-force-itbps-dog-squad-in-naamkaran-ceremony/articleshow/80038418.cms

No comments