Breaking News

హథ్రాస్ కేసు: తనకు దక్కలేదనే అక్కసుతో ప్రేమోన్మాది ఘాతుకం.. సీబీఐ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. యువతి తనకు దక్కడంలేదనే అక్కసుతోనే ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు సీబీఐ పేర్కొంది. ఇందులో ఉత్తరప్రదేశ్‌ పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని, సరైన సమయంలో స్పందించలేదని తెలిపింది. నలుగురు నిందితుల్లో ఒకడు, ప్రధాన నిందితుడు సందీప్.. బాధితురాలి ఇంటికి సమీపంలోనే ఉండేవాడు. యువతితో మూడేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమ వరకు వెళ్లింది. ఇరువురూ ఫోన్లు చేసుకుని, ఏకాంతంగా కలుసుకునేవారు. ఇరువురి మధ్య 2019 అక్టోబరు 17 నుంచి 2020 మార్చి 3 వరకూ 105 ఫోన్‌కాల్స్‌ ఉన్నాయి. అయితే, ఈ ప్రేమ వ్యవహారంపై యువతి తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. సందీప్ తండ్రి గ్రామపెద్ద కావడంతో ఆయనకు ఫిర్యాదుచేశారు. దీనిపై ఇరు కుటుంబాల మధ్య గొడవ జరగడంతో సందీప్‌ ఇంటి వద్ద పంచాయితీ పెట్టారు. అ తర్వాత నుంచి సందీప్‌‌కు బాధితురాలు దూరంగా ఉంటుంది. అతడికి ఫోన్ చేయడం ఆపేయడం..సందీప్‌ వేరే నెంబర్లతో ప్రయత్నించినా వాటిని తిరస్కరించింది. దీంతో.. తనను దూరం పెట్టిన ఆమె మరో వ్యక్తికి దగ్గరవుతుందేమోనని అనుమానం పెంచుకుని కోపంతో రగిలిపోయాడు. అనుమానం పెనుభూతమైనట్టు ఇది అతడిలో క్రూరత్వాన్ని తట్టిలేపింది. తనలోని రాక్షసత్వాన్ని మేల్కొపడంతో ఇంతటి ఘోరానికి కారణమైంది. ఆమె ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురుచూశాడు. బాధితురాలు తమ ఊరిచివర పొలానికి వెళ్తున్న విషయం తెలుసుకుని ఆమెను వెంబడించి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం గురించి ఆమె బయటపెడితే తమకు ప్రమాదమని గొంతు నులిమి హత్యచేయడానికి ప్రయత్నించారు. ఆమె చనిపోయిందని భావించి వదలివెళ్లిపోయారు. ఇక, సెప్టెంబరు 14న జొన్నతోటలో ఒంటరిగా ఉన్న సమయంలో తనపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారని పేర్లతోసహా మరణ వాంగ్మూలంలో బాధితురాలు పేర్కొంది. ఆ రోజున నిందితులు నలుగురూ ఊర్లోని లేదా సంఘటన ప్రదేశానికి దగ్గరలోనే ఉన్నట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ విషయాన్ని గ్రామస్థులు కూడా ధ్రువీకరించారు. బాధితురాలిపై భౌతికదాడి జరిగిందని, అత్యాచారం జరిగిందనడానికి ఆధారాలు లభించలేదని సెప్టెంబరు 22న అలీగఢ్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపేర్కొంది. తర్వాత పలువురు నిపుణులతో ఏర్పాటు చేసిన మెడికల్‌ బోర్డు కూడా అత్యాచారంపై స్పష్టంగా ఓ నిర్ధారణకు రాలేదని సీబీఐ ప్రస్తావించింది. ఘటన జరిగిన వారం దాటిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించడంతో.. అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు లభించకపోయి ఉండొచ్చని సీబీఐ అభిప్రాయపడింది. ఈ కేసులో యూపీ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తనపై అత్యాచారం జరిగిందని స్వయంగా బాధితురాలు వెల్లడించినా వారం రోజుల వరకు ఆమెను వైద్య పరీక్షలకు పంపలేదు. కనీసం మహిళా పోలీస్ అధికారిని కూడా నియమించలేదు. అంతేకాదు, ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన తర్వాత అర్ధరాత్రి 2 గంటల సమయంలోనే అంత్యక్రియలు నిర్వహించడంతో పోలీసుల వైఖరిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోస్ట్‌మార్టం నివేదికలో అత్యాచారం గురించి స్పష్టంగా చెప్పకపోయినా.. ఆమె మర్మాంగాలపై గాయాలున్నట్టు పేర్కొంది. అంతేకాదు, ఆమె శరీరంపై అనేక గాయాలు, పక్షవాతం, వెన్నుపూస గాయం, నాలుక బయటకు లాగేసినట్టు తెలిపింది.


By December 22, 2020 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/accused-was-frustrated-after-victim-ignored-him-says-cbi-charge-sheet-on-hathras-case/articleshow/79850156.cms

No comments