దర్జాగా విమానాల్లో వచ్చి మాల్స్‌లో చోరీలు.. ఆర్కెస్ట్రా సింగర్ చేతివాటం
చూడటానికి ఆమె ఆర్కెస్ట్రా సింగర్.. ప్రవృత్తి మాత్రం దొంగతనం.. మెట్రో నగరాల్లోని ప్రముఖ షాపింగ్ మాల్స్, బ్యూటీపార్లర్లనే లక్ష్యంగా చేసుకొని అక్కడ కస్టమర్ల బ్యాగ్‌లు అపహరించడంలో సిద్ధహస్తురాలు. అంతేకాదు, చోరీలు చేయడానికి విమానాల్లో వెళ్లిరావడమే ఈ కిలేడీ ప్రత్యేకత. సింగర్ ముసుగులో పదేళ్లుగా ఆమె కొనసాగిస్తున్న చోరీల గుట్టును ముంబయి పోలీసులు ఎట్టకేలకు రట్టుచేశారు. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో ఆమె అంగీకరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన అర్చన(46)గా గుర్తించారు. ఆమెకు మూన్‌మూన్ హుస్సేన్ అలియాస్ అర్చనా బరౌ అలియాస్ నిక్కీ అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ముంబయిలోని ప్రఖ్యాత మాల్‌లో చోరీ జరగ్గా.. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. చోరీపై అందిన ఫిర్యాదుతో ఆరా తీయగా అర్చన చరిత్ర బయటకొచ్చింది. అంతకు ముందు దాదర్‌లో ఓ మాల్, బ్యూటీపార్లర్‌లోనూ ఇదే తరహాలో చోరీలు జరగడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌టవర్ లొకేషన్‌లను విశ్లేషించి ఆమె ఫోటోలను సేకరించారు. ఫేస్‌బుక్‌లో ఆమె ఫోటోలను పరిశీలించిన తర్వాత అర్చన నిర్వాకమేననే నిర్ధారణకు వచ్చారు. ముంబయి మాల్‌లో మొత్తం రూ.14.9 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు, విలువైన పత్రాలున్న బ్యాగును ఓ మహిళ వద్ద కొట్టేసిన అర్చన.. అక్కడ నుంచి పరారయ్యింది. బాధితురాలు బ్యాంకు లాకర్‌లో నగలు తీసుకుని, తన బంధువుల వివాహానికి వెళ్లడానికి సిద్ధపడుతుండగా అర్చన ఆ బ్యాగును చోరీ చేసింది. తన కుమారుడితో కలిసి లోయర్ పరేల్‌లో మాల్‌కు వెళ్లానని, అక్కడ వస్తువులు కొన్న తర్వాత బిల్లు చెల్లించడానికి కౌంటర్ సమీపంలో బ్యాగును ఉంచినప్పుడు చోరీకి గురయ్యిందని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల కిందట ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు బెంగళూరుకు వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు. 2009 నుంచి ఇలా చోరీలు చేస్తున్నట్లు ఆమె అంగీకరించింది. హైదరాబాద్‌లో ఆ సింగర్ చేసిన చోరీల గురించి తెలంగాణ పోలీసులకు ముంబయి పోలీసులు సమాచారం అందించారు. త్వరలోనే ఆమెను పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశముంది.
By December 19, 2020 at 09:24AM
No comments