టీకా అత్యవసర అనుమతిలో తొందరపడొద్దు.. కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సూచన
మరి కొద్ది రోజుల్లోనే దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందనే ప్రచారం సాగుతున్న వేళ.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక సూచనలు చేసింది. టీకా అనుమతి విషయంలో తొందరపడొద్దని, అన్ని జాగ్రత్తలనూ తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలని సూచించింది. ఈ మేరకు ఆనంద్ శర్మ నేతృత్వంలోని కేంద్రానికి సిఫార్సులు చేసింది. టీకా క్లినికల్ ట్రయల్స్ సంతృప్తికరంగా పూర్తయి, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్న తరువాతనే వినియోగానికి అనుమతులు ఇవ్వాలని నివేదికలో స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం, అన్ని దశలూ పూర్తయిన తరువాతనే టీకా వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. టీకా తయారుచేసిన తరువాత తొలుత చిన్న జంతువులు, తర్వాత మనుషులపై వివిధ దశల్లోనూ పరీక్షించి, ఫలితాలను విశ్లేషించడం తప్పనిసరని గుర్తు చేసింది. అంతేకాదు తొందర పాటుతో నిర్ణయాలు కూడదని గుర్తుచేసింది. ‘మేనేజ్‌మెంట్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ అండ్ కో-ఆర్డినేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్’ పేరిట ఈ నివేదికను స్టాండింగ్ కమిటీ అందజేసింది. వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన మౌలిక వసతులు, శీతల గిడ్డంగులు, దుష్ప్రభావాలు తలెత్తితే, వారికి అందజేయాల్సిన చికిత్సలు తదితర అంశాలపై కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఈ నివేదిక రాజ్యసభ ఛైర్మన్, ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అందజేసింది. ప్రయివేట్ హాస్పిటల్స్‌పై నిఘా ఉంచి, ఔషధాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా చూసేందుకు సమగ్ర ప్రజారోగ్య చట్టాన్ని అమలు చేయాలని సూచించింది. నాణ్యమైన, సమర్ధవంతమై ఔషధాలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉంచాలని ముఖ్యంగా కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయిన అల్పాదాయ వర్గాలకు తక్కువ ధర, రాయితీతో అందజేయాలని పేర్కొంది. టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసిన మూడు సంస్థలను విన్నపాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందనే వార్తలు వస్తున్న వేళ స్టాండింగ్ కమిటీ నివేదిక చేసిన సిఫార్సులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటివరకూ మూడు వ్యాక్సిన్ సంస్థలు టీకా అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్, ఫైజర్ సంస్థలు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను కోరాయి. వీటిపై సీడీఎస్సీఓ (కమిటీ ఆఫ్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నిపుణుల కమిటీ తన సిఫార్సులను ఇస్తే, వాటి ఆధారంగా డీసీజీఐ నిర్ణయం తీసుకోవాల్సి వుంది.
By December 22, 2020 at 01:20PM
No comments