Breaking News

ఉద్ధృతమవుతోన్న రైతుల ఆందోళన.. రెండు రోజుల ముందే చర్చలకు కేంద్రం ఆహ్వానం


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఎముకల కొరికే చలిలోనూ వెన్నువెరవని రైతుల కార్యదీక్షకు ప్రతి ఒక్కళ్లూ గులాం అవుతున్నారు. దేశానికి అన్నంపేట్టే కర్షకుడు కన్నెర్ర జేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఈ నేపథ్యంలో రైతులతో చర్చలకు కేంద్రం ముందుకొచ్చింది. మంగళవారం చర్చలకు రావాలని వారిని పిలుపునిచ్చింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు భేటీకి రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సోమవారం అర్ధరాత్రి కోరారు. వాస్తవానికి ఈ చర్చలు గురువారం జరగాల్సి ఉండగా కరోనా వైరస్ ముప్పు, చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రెండు రోజులు ముందుగానే నిర్వహించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. హరియాణా-ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులు ఆందోళనలు ఐదో రోజూ కొనసాగాయి. సిక్కు మత స్థాపకుడు గురు నానక్‌ దేవ్‌ జయంతి సందర్భంగా చేయాల్సిన ‘అర్దాస్‌’ (ప్రార్థనలు)లను కూడా అక్కడే నిర్వహించారు. ‘ఖారా ప్రసాద్‌’ను తయారు చేసి పంపిణీ చేశారు. తాము వచ్చిన వాహానాలపైనే టార్పాలిన్లు కప్పి గుడారాలుగా మార్చుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దులోని ఘాజీపుర్‌ వద్ద రైతుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. వారు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు పెద్దపెద్ద కాంక్రీట్‌ దిమ్మెలను అడ్డంగా పెట్టారు. అయితే ఈ రహదారిని మాత్రం దిగ్బంధించలేదు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధ్యక్షుడు నరేశ్‌ తికాయత్‌ మాట్లాడుతూ ‘గణతంత్ర దినోత్సవం వరకు అవసరమైన సరకులను తెచ్చుకున్నాం. డిమాండ్లను ఆమోదించే వరకు కదిలేది లేదు’ అని చెప్పారు. బ్రిటిష్ ఎంపీలు, అంతర్జాతీయ క్రికెటర్లు, సినిమా ప్రముఖులు రైతులకు సంఘీభావం తెలిపారు. పట్ల పోలీసులు, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న రైతులపై ఇప్పటి వరకు 31 కేసులు నమోదు చేశారు. కాగా, రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ సంస్కరణలు అన్నదాతలకు మరింత శక్తినిస్తాయని, వారికి మేలు చేకూర్చుతాయని పేర్కొన్నారు. చరిత్రాత్మక చట్టాలపై విపక్షాలు లేనిపోని అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.


By December 01, 2020 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/after-high-level-hurdle-government-invites-farmers-for-talks-today/articleshow/79503130.cms

No comments