తమిళ బుల్లితెరపై విషాదం.. ‘పాండియన్ స్టోర్స్’ నటి వి.జె.చిత్ర ఆత్మహత్య
తమిళ బుల్లితెరపై విషాదం చోటుచేసుకుంది. ‘పాండియన్ స్టోర్’లో ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొద్ది నెలల క్రితమే ఆమెకు వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి హోటల్ గదిలో ఉన్న సమయంలోనే చిత్ర ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం... ఈవీపీ ఫిల్మ్‌సిటీలో ఓ షూటింగులో పాల్గొన్న చిత్ర మంగళవారం 2.30 గంటల సమయంలో హోటల్ రూమ్‌కి వచ్చారు. స్నానం చేసి వస్తానని హేమంత్‌కు చెప్పి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటికి రాలేదు. హేమంత్ ఎన్నిసార్లు పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో అతడు హోటల్ సిబ్బందిని రప్పించి డూప్లికేట్ కీతో తలుపు తెరిచారు. అప్పటికే ఆమె గదిలో చీరతో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో హేమంత్ వెంటనే నజరత్‌పేట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని చిత్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై చిత్ర కుటుంబసభ్యులు ఇంకా స్పందించలేదు. బుల్లితెరపై విశేషంగా రాణిస్తూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న చిత్ర ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఆమె స్నేహితులు, సహనటులు షాకవుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
By December 09, 2020 at 09:09AM
No comments