అంతంత మాత్రంగా సంబంధాలు.. ఆస్ట్రేలియా, చైనా మధ్య చిచ్చురేపిన ట్వీట్
పుణ్యమా అని చైనాతో పలు దేశాలకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మహమ్మారి విషయంలో చైనాను వేలెత్తి చూపుతోన్న ప్రధాన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల క్షీణించాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా-చైనాల మధ్య ఓ ట్వీట్ వివాదాన్ని రాజేసింది. అఫ్గానిస్థాన్ బాలుడి మెడను ఆస్ట్రేలియా సైనికుడు కత్తితో నరుకుతున్నట్టు ఓ ఫొటోను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ ట్విట్టర్‌లో షేర్ చేయడం వివాదాస్పదమవుతోంది. ‘అఫ్గన్ పౌరులు, ఖైదీలను ఆస్ట్రేలియా సైనికులు హత్య చేయడం దిగ్భ్రాంతికి గురిచేసింది. వీటిని ఖండిస్తున్నాం. ఇందుకు వారు బాధ్యత వహించాలి’ అంటూ ఫోటోను షేర్ చేసిన ట్వీట్ చేశారు. దీనిపై ఆస్ట్రేలియా తీవ్రంగా స్పందించింది. ఇది తప్పుడు ఆరోపణ అని, అసహ్యకరమైన ట్వీట్ అని ప్రధాని స్కాట్ మోరిసన్ వ్యాఖ్యానించారు. ఇది నకిలీ ఫోటో అని మార్ఫింగ్ చేసి పెట్టిన దీనిని వెంటనే తొలగించి క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. ఇటువంటి పని చేయడానికి సిగ్గుపడాలని, చైనా ప్రపంచం దృష్టిలో చులకనయిందని మోరిసన్ మండిపడ్డారు. ఇరు దేశాల మధ్య విబేధాలున్నప్పటికీ, వాటిని ఎదుర్కొనే మార్గం ఇది కాదని హితవు పలికారు. అఫ్గనిస్థాన్‌లో తమ సైనికులు చేసిన అకృత్యాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వమే దర్యాప్తు జరుపుతోంది. 2009-13 మధ్య 39 మంది అఫ్గన్ పౌరుల హత్యల (మొత్తం 36 కేసులు)తో వారికి ప్రమేయం ఉన్నట్టు గుర్తించింది. దీనిని ఆధారం చేసుకునే చైనా తప్పుడు ఫొటోలతో ట్వీట్ చేసినట్టు ఆస్ట్రేలియా ఆరోపించింది. అటు, ఈ ఫోటోఫై ఆస్ట్రేలియా డిమాండ్‌కు చైనా ససేమిరా అంటోంది. తాము క్షమాపణలు చేప్పే ప్రసక్తేలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హూ చుయాంగ్ స్పష్టం చేశారు. ‘ఆఫ్ఘన్ పౌరులను అత్యంత దారుణంగా చంపడం సమర్థనీయమని వారు భావిస్తున్నారా.. కానీ అఫ్గన్ల ప్రాణాల విషయంలో అలాంటి క్రూరత్వాన్ని ఖండించడం కూడదా?’ అని ప్రశ్నించారు.
By December 01, 2020 at 10:05AM
No comments