నైజీరియాలో ఇద్దరు భారతీయులు కిడ్నాప్.. విదేశీయులకు పోలీసులు కీలక సూచనలు
నైజీరియాలో ఇద్దరు భారతీయులు అపహరణకు గురయ్యారు. వారు పనిచేస్తున్న ఫార్మ కంపెనీ నుంచి వస్తుండగా బుధవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకితో బెదిరించి ఇరువురినీ కిడ్నాప్ చేశాడు. నైరుతి నైజీరియాలోని ఓయో రాష్ట్ర రాజధాని ఇబదాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విదేశీ పౌరులు అప్రమత్తంగా ఉండాలని నైరుతి నైజీరియా పోలీసులు ఆదివారం హెచ్చరికలు జారీచేశారు. వాహనంపై వస్తున్న ఇద్దర్నీ అడ్డుకున్న ఆగంతుకుడు.. అపహరించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై నైరుతి నైజీరియా పోలీస్ విభాగం అధికార ప్రతినిధి ఓల్గ్‌బెంగ్ ఫెడేయ్ మాట్లాడుతూ.. కిడ్నాప్‌నకు గురయిన భారతీయులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వీరు ఎక్కడ ఉన్నారనేది, ఎవరు కిడ్నాప్ చేశారనేది ఇంకా తెలియరాలేదన్నారు. బాధిత కుటుంబాలతో కిడ్నాపర్లు సంప్రదించారా? అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే, విదేశీ పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచించారు. తమ పరిసరాల్లోని వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే పోలీసులను అప్రమత్తం చేయాలని అన్నారు. వందలాది మంది భారతీయులు ఉపాధి కోసం నైజీరియాకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమల్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఇక, విదేశీయులు, ప్రముఖులను నైజీరియాలోని కిడ్నాప్ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటాయి. అపహరించిన తర్వాత డబ్బులు డిమాండ్ చేసి, నగదు అందిన తర్వాత బాధితులకు ఎటువంటి హాని తలపెట్టకుండా వదిలిపెడుతుంటారు.
By December 14, 2020 at 10:21AM
No comments