Breaking News

కేరళలో ప్రకంపనలు రేపుతున్న షిగెల్లా .. ఒకరు మృతి, పదుల సంఖ్యలో ఆస్పత్రులకు


దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోన్న తరుణంలో మరో కొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. సాంక్రమిక బ్యాక్టీరియా ‘షిగెల్లా’ బారినపడి 11 ఏళ్ల చిన్నారి కేరళలోరి కోజికోడ్‌లో మృతిచెందాడు. ఆ బాలుడు రెండు రోజుల కిందట షిగెల్లాతో ప్రాణాలు కోల్పోగా.. ఆ చిన్నారితో సన్నిహితంగా మెలిగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. ‘షిగెల్లా’లక్షణాలైన.. జ్వరం, అతిసారం, కడుపులో తిప్పడం వంటి సమస్యలతో దాదాపు 20 మంది శనివారం వివిధ ఆస్పత్రుల్లో చేరారు. బాలుడు మృతిచెందిన ప్రాంతంలో త్వరలోనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి శైలజ వెల్లడించారు. ఈ ఇన్‌ఫెక్షన్ నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారని, పరిశుభ్రత ద్వారానే దీనిని నిరోధించవచ్చని ఆమె అన్నారు. షిగెల్లా వల్ల బాలుడు చనిపోవడంతో ఆ ప్రాంతంలోని నీటి వనరులను అధికారులు క్లోరినేషన్ చేశారు. బాలుడు మృతిచెందిన తర్వాత ఆ చిన్నారితో సన్నిహితంగా మెలిగిన కొందరు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని కోజికోడ్ జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ తెలిపారు. జ్వరం, స్వల్పంగా డయోరియా లక్షణాలతో శనివారం 20 మంది ఆస్పత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. వీరిలో చాలా మంది ఆ బాలుడితో సన్నిహితంగా మెలిగినవారేనని ఆమె వివరించారు. గతేడాది కీజపయూర్‌లోని వెస్ట్ లోయర్ ప్రైమరీ పాఠశాలలోని 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు విద్యార్థులకు షిగెల్లా నిర్ధారణ అయ్యింది. చికిత్స తర్వాత వీరు కోలుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా నీటిలో ఉన్నట్టు అధికారులు అప్పట్లో గుర్తించారు. షిగెల్లా బారిపడ్డ వ్యక్తులకు తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యమంగా పాఠశాలలు, డే కేర్ సెంటర్లు, నర్సింగ్ హోమ్స్ లేదా అపరిశుభ్ర ప్రదేశాల్లో తీవ్రంగా ఉంటుంది. కొందరికి ఎటువంటి లక్షణాలు లేకుండానే వ్యాప్తి చెందుతుంది.


By December 20, 2020 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-on-high-alert-after-shigella-bacterial-infection-claims-one-life/articleshow/79820940.cms

No comments