Breaking News

వచ్చే ఏడాది నాలుగు గ్రహణాలు.. భారత్‌లో దర్శనమిచ్చేవి ఎన్నంటే?


వచ్చే ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నట్టు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో ఉన్న జివాజీ అబ్జర్వేటరీ కేంద్రం వెల్లడించింది. రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో సంపూర్ణం సూర్య, చంద్రగ్రహణ ఒక్కొక్కటి ఏర్పడనున్నాయని, రెండు గ్రహణాలు మాత్రమే దేశంలో కనిపిస్తాయని జివాజీ ఇన్‌స్టిట్యూట్ సూపరింటిండెంట్ డాక్టర్ రాజేంద్రప్రకాశ్ గుప్తా తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. 2021లో తొలి గ్రహణం మే 26న ఏర్పడనుందని, ఇది చంద్రగ్రహణం అన్నారు. ఈ గ్రహణం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే పశ్చిమ్ బెంగాల్, ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాల్లో స్పష్టంగా కనువిందు చేయనుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మే 26న ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా చంద్రుడ్ని భూమి 101.6 శాతం మేర కప్పి ఉంచుతుందని ఆయన వివరించారు. అలాగే, జూన్ 10 తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుందని, దీని ప్రభావం భారత్‌లో ఉండదని వ్యాఖ్యానించారు. భూమి, సూర్యుడు మధ్య కక్ష్యలోకి చంద్రుడు వచ్చి 94.3 శాతం మేర ఆవరిస్తాడని అన్నారు. ఇది కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణమని రాజేంద్రప్రకాశ్ తెలిపారు. అనంతరం నవంబరు 19న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందని, ఇది భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ సహా కొన్ని ప్రాంతాల్లో దర్శనమిస్తుందని పేర్కొన్నారు. ‘చంద్ర గ్రహణం గరిష్ట సమయంలో 97.9 శాతం చంద్రుడు భూమి నీడతో కప్పి ఉంటుంది.. 2021 చివరి గ్రహణం డిసెంబరు 4 న ఏర్పడుతుంది.. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం.. దేశంలో మాత్రం ఇది కనిపించదు’ అని గుప్తా వివరించారు. ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇందులో రెండు సూర్య, నాలుగు చంద్రగ్రహణాలు ఉన్నాయి. కొన్నిసార్లు భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తాడు. ఆ సమయంలో సూర్య కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు. భూపై చంద్రుడి నీడ పడటంతో అక్కడివరకు సూర్యుడిని కప్పి ఉంచే ప్రక్రియను సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పి ఉంచినప్పుడు పాక్షిక సూర్య గ్రహణం, చంద్రుడు పూర్తిగా కప్పి ఉంచితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో సూర్య కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. చంద్రుడిపై భూమి నీడ పడటంతో కప్పి ఉంచే ప్రక్రియను చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పాక్షికంగా కప్పి ఉంచినప్పుడు పాక్షిక చంద్ర గ్రహణం, పూర్తిగా కప్పి ఉంచితే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య నాడు, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడతాయి. అయితే, అన్ని అమావాస్యలు, పౌర్ణమిలకు గ్రహణాలు ఏర్పడవు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమంలో పునరావృతం అవుతాయి.


By December 28, 2020 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/four-eclipses-in-2021-two-to-be-visible-in-india-says-jiwaji-planet-observatory/articleshow/79985105.cms

No comments