Breaking News

సోషల్ మీడియాలో పరిచయంతో తొమ్మిది హత్యలు.. జపాన్ ట్విట్టర్ కిల్లర్‌కు మరణశిక్ష


సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, తొమ్మిది మందిని అత్యంత కిరాతకంగా హత్యచేసిన జపాన్ ట్విట్టర్ కిల్లర్‌ తకాహిరొ షిరాయిషికు టోక్యో జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే యువతులతో పరిచయం పెంచుకుని, వారి ఆత్మహత్యకు సాయం చేస్తానని, తన అపార్ట్‌మెంటుకు రమ్మని పిలిచేవాడు. అలా వచ్చిన వారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసేవాడు. అతడి దారుణాన్ని అడ్డుకోబోయిన ఒక యువతి ప్రియుడిని కూడా హత్యచేశాడు. ఇలా మొత్తం 9 మందిని చంపి, ముక్కలుగా చేసి తన ఇంట్లోని కోల్డ్‌ స్టోరేజీలో భద్రపరిచాడు. ట్విటర్‌ ద్వారా మృతులను ఆకర్షించడంతో అతడికి ట్విటర్‌ కిల్లర్‌ అన్న పేరు వచ్చింది. కాగా.. ఎట్టకేలకు 2017లో పోలీసులు షిరాయిషీని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం షిరాయిషీకి మరణశిక్ష విధిస్తున్నట్లు టోక్యో కోర్టు తీర్పునిచ్చింది. మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధంగా ఉన్న15-26ఏళ్ల మధ్య వయస్కులను నరహంతకుడు షిరాయిషి ట్విట్టర్ ద్వారా సంప్రదించాడు. నిందితుడి తరఫు లాయర్ మాత్రం.. బాధితుల సమ్మతితోనే వారి చావునకు సహకరించాడని, అతడికి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించాలని కోరాడు. అయితే, షిరాయిషి మాత్రం ఈ వాదనలు సరైనవి కాదని, ఎటువంటి అనుమతి తీసుకోకుండానే హత్యలు చేశానని పేర్కొన్నాడు. బాధితుల తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయి... అంటే దీని అర్థం సమ్మతి లేదని, వారు ప్రతిఘటించలేదని అన్నారు. తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్విట్ చేసిన ఓ 23 ఏళ్ల మహిళ కనిపించకుండా పోవడంతో మూడేళ్ల కిందట షిరాయిషి హత్యలు బయటపడ్డాయి. సదరు మహిళ కనిపించకుండా పోయిన తర్వాత బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చి ఆమె ట్విట్టర్ ఖాతాను తెరవగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. షిరాయిషీతో ఆమె తరుచూ ట్విట్టర్‌లో సంప్రదించినట్టు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడి ఇంటి కింది భాగంలో ఓ రహస్య గదిని బయటపడగా.. అందులో 9 మృతదేహాలను గుర్తించారు. అందులో ముక్కలుగా చేసిన శరీర భాగాలు, 240 ఎముకలను బాక్సుల్లో దాచి ఉంచాడు. ప్రపంచంలోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల్లో జపాన్‌లోనే అధికంగా ఏడాదికి 20వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.


By December 16, 2020 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/japan-twitter-killer-takahiro-shiraishi-sentenced-to-death-for-serial-murders/articleshow/79751555.cms

No comments