Breaking News

నేరం నిర్ధారణపై స్టే ఇవ్వకపోతే పోటీకి అనర్హులే.. సుప్రీం సంచలన తీర్పు


ఎన్నికల్లో నేర చరితుల పోటీపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కీలక తీర్పు వెలువరించింది. ఏదైనా నేరానికి పాల్పడి దోషిగా నిర్ధారణ అయి, రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పొందినవారు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీకి అనర్హులేనని స్పష్టం చేసింది. ఒకవేళ దోషిగా నిర్ధారణ అయిన తర్వాత ఆ ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించినా పోటీకి అర్హులవుతారని పేర్కొంది. ఈ మేరకు కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల త్రిసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. సోలార్ కుంభకోణం కేసులో కేరళకు చెందిన సరితా నాయర్‌కు మూడేళ్ల జైలు శిక్ష ఖరారయ్యింది. దీంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎర్నాకులం, వాయనాడ్‌ స్థానాలకు ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. దోషిగా తేలినా తనకు విధించిన శిక్షపై అప్పీలేట్‌ కోర్టు స్టే విధించడంతో ఎన్నికల్లో పోటీకి అర్హురాలేనంటూ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో ఆమె సుప్రీంకోర్టు తలుపుతట్టారు. తాజాగా, సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఆమెకు చుక్కెదురయ్యింది. శిక్ష అమలును మాత్రమే సస్పెన్షన్‌లో ఉంచారని, దోషిగా నిర్ధరించటంపై స్టే ఇవ్వలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కాబట్టి, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం రిటర్నింగ్‌ అధికారి తీసుకున్న నిర్ణయం సరైనదేనని ధర్మాసనం ఉద్ఘాటించింది. అయితే, అమేథిలో నామినేషన్‌ దాఖలు చేస్తూ శిక్ష విషయాన్ని వెల్లడించినా అక్కడి రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించకపోవడాన్ని పిటిషనర్‌ వాదనకు బలం చేకూర్చే అంశంగా భావించలేమని స్పష్టం చేసింది. ఎర్నాకులం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి హిబీ ఎడెన్ విజయం సాధించారు. దీంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ సరితా నాయర్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


By December 10, 2020 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-rejects-plea-of-solar-scam-accused-saritha-s-nair-against-ernakulam-mp-hibi-eden/articleshow/79654809.cms

No comments