Breaking News

రజినీకాంత్ డిశ్చార్జ్.. వారం రోజుల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్


అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరిన సూపర్ స్టార్ కోలుకున్నారు. ఆయన రక్తపోటు నిలకడగా ఉండటంతో ఆయన్ని ఆదివారం సాయంత్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రజినీకాంత్‌ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు ఆదివారం మధ్యాహ్నం అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కాసేపటికే రజినీకాంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు పయనమయ్యారు. ‘అన్నాతే’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రజినీకాంత్.. నిర్విరామంగా చిత్రీకరణలో పాల్గొన్నారు. మరోవైపు ‘అన్నాతే’ టీంలో కరోనా కలకలం సృష్టించింది. ఈ చిత్ర బృందంలో నలుగురికి కొవిడ్-19 పాజిటివ్ రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆయనకు నెగిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ తరవాత తీవ్ర రక్తపోటు, అలసటతో బాధపడిన రజినీ ఈనెల 25న జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఇంచుమించుగా రెండు రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉన్న రజినీకాంత్‌కు రక్తపోటు నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అయితే, వారం రోజులపాటు రజినీకాంత్‌కు పూర్తి విశ్రాంతి (బెడ్ రెస్ట్) అవసరం అని వైద్యులు పేర్కొన్నారు. అలాగే, రోజూ రక్తపోటును పరీక్షించుకోవాలన్నారు. ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉండాలన్నారు. అలాగే, కొవిడ్-19 దృష్టిలో ఉంచుకుని ఎవరినీ కలవకుండా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.


By December 27, 2020 at 06:30PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-rajinikanth-discharged-from-hyderabad-apollo-hospital/articleshow/79978639.cms

No comments