Breaking News

కశ్మీర్‌లో అనూహ్య ఘటన.. తల్లిదండ్రుల విజ్ఞ‌ప్తితో ఉగ్రవాదం వీడిన ఇద్దరు యువకులు


ఉగ్రవాదంలో చేరిన కశ్మీరీ యువతను తిరిగి జనజీవన స్రవంతిలో కలవడానికి సైన్యం, పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో చేరిన ఇద్దరు యువకులు, కుటుంబసభ్యుల నచ్చజెప్పడంతో లొంగిపోయిన ఘటన కశ్మీర్‌లో చేసుకుంది. మంగళవారం ఉదయం కుల్గామ్ జిల్లా తొంగుడౌన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న సైన్యం అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో ఉగ్రవాదులు, సైన్యం మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా ఉగ్రవాదులను లొంగిపోవాలని భద్రతా దళాలు సూచించాయి. కుటుంబసభ్యుల కూడా వారికి నచ్చజెప్పడంతో ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు. కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం కుల్గామ్ జిల్లాలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు లొంగిపోయారని తెలిపారు. కుటుంబసభ్యులు విజ్ఞ‌ప్తి చేయడంతో ఆయుధాలను వదిలేసి వచ్చారని అన్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, పేలుడు పదార్థాలు సహా ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. తొంగుడౌన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో , సీఐఎస్ఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 మంది ఉగ్రవాదులు లొంగిపోయారని ఐజీ పేర్కొన్నారు. ఇక, గురువారం అనంత్‌నాగ్‌లోని గుండ్ బాబా ఖలీల్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. గాయాలతో పట్టుబడ్డ అతడికి ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు, అసోంలో 64 మంది ఉగ్రవాదులు ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు. వీరిలో ఉల్ఫా అగ్రనేత కూడా ఉన్నారు. ఉల్ఫాకు చెందిన 18 మంది, యునైటెడ్ పీపుల్స్ రివల్యూషనరీ ఫ్రంట్ 32 మంది, దైమాస నేషనల్ లిబరేషన్ ఆర్మీ 13 సీఎం ఎదుట లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు.


By December 22, 2020 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-lashkar-e-taiba-terrorists-surrender-during-encounter-at-kulgam/articleshow/79852433.cms

No comments