సిస్టర్ అభయ హత్య కేసు: 28 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు.. న్యాయం కోసం ఇన్నేళ్లు ఎదురుచూపులా?
దాదాపు మూడు దశాబ్దాల కిందట కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫేలను దోషులుగా నిర్ధారించింది. హత్య జరిగేనాటికి సిస్టర్ అభయ వయసు 21 ఏళ్లు. ఈ కేసు 28 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ కొనసాగింది. నాలుగేళ్ల కిందటే అభయ తల్లిదండ్రులు చనిపోయారు. సిస్టర్ అభయ 1992 మార్చి 27న కొట్టాయంలోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్ వద్ద ఉన్న ఓ బావిలో శవమై తేలింది. ప్రమాదవశాత్తు సిస్టర్ అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చని పోలీసులు తొలుత భావించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఇది హత్యగా అనుమానించి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కేసు విచారణను 1993లో సీబీఐకి అప్పగించింది. సిస్టర్ అభయ హత్యకు గురైనట్టు సీబీఐ విచారణలో తేలింది. ఆమె భుజం,కుడి చెవిపై బలమై గాయాలైనట్లు నిర్దారించింది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్‌లో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఫాదర్ థామస్ కొట్టార్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు మరో క్రైస్తవ సన్యాసిని సెఫేలను 2008లో సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ చార్జిషీట్ ప్రకారం... మార్చి 27న తెల్లవారుజామున 4.15 గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో ఫాదర్ థామస్, జోస్ పుత్రుక్కయిల్‌లు సెఫేతో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం సిస్టర్ అభయ ఎక్కడ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో పడేశారు. ఈ కేసులో దోషిగా తేలిసి సెఫే కూడా సిస్టర్ అభయతో హాస్టల్‌లో ఉంటూ, ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని చాలాకాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులను నిర్ధారించింది. సిస్టర్ అభయ కొట్టాయం బీసీఎం కాలేజీలో విద్యాభ్యాసం చేయగా.. ఫాదర్ థామస్ అక్కడ సైకాలజీ లెక్చరర్‌గా పనిచేశారు. తర్వాత కొట్టాయంలోని క్యాథలిక్ డియోసెసి ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. తొలుత సీబీఐ ముగ్గురిపై కేసు నమోదు చేయగా.. నిందితులలో ఒకరైన పుత్రుక్కయిల్‌ను 2018లో ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, మిగతా ఇద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను తిరస్కరించింది. హత్య జరిగిన రోజు రాత్రి కుక్కలు మొరగలేదని, వంటగది తలుపు బయటి నుంచి లాక్ చేసి ఉందని, హాస్టల్‌లో ఉన్నవారికి అభయ బావిలో పడిపోయి శబ్దం వినబడకపోవటం వంటి సందేహాలను కోర్టు లేవనెత్తింది.
By December 22, 2020 at 12:19PM
No comments