Breaking News

కొత్త పార్లమెంట్‌ భవనం: భూమిపూజకే అనుమతి.. కేంద్రానికి సుప్రీం బ్రేకులు


నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబరు 10న భూమిపూజ నిర్వహించనున్నారు. అయితే, ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు కాగా.. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త పార్లమెంట్ భవనానికి కేవలం భూమిపూజ మాత్రమే నిర్వహించాలని, నిర్మాణం లేదా కూల్చివేత పనులు చేపట్టవద్దని కేంద్రానికి సూచించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ..కేవలం శంకుస్థాపన మాత్రమే నిర్వహిస్తున్నామని, ఎటువంటి నిర్మాణం గానీ, చెట్లు కూల్చివేతలు గానీ ఇప్పటి వరకూ చేపట్టలేదని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. మీరు పేపర్ వర్క్ లేదా శంకుస్థాపన చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు.. కానీ నిర్మాణం మాత్రం ప్రారంభించవద్దని సూచించింది. ఈ నిర్మాణంలో కేంద్రం ఇంత దూకుడుగా ముందుకు సాగుతుందని ఎప్పుడూ అనుకోలేదని తమ పరిశీలనలో వ్యక్తమయ్యిందని పేర్కొంది. కాగా, కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను రెండు రోజుల కిందటే కేంద్రం విడుదల చేసింది. డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా పార్లమెంట్ భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ జరుగనుందని తెలిపింది. మొత్తం 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లెమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.971 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ భవన నిర్మాణ బాధ్యతలను దిగ్గజ సంస్థ ‘టాటా’ చేపట్టింది. 2021 ఆగస్టు 15 నాటికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనుంది. ఈ అరుదైన ఘట్టానికి సాక్ష్యంగా పార్లమెంట్ కొత్త భవనాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. విశాలమైన ఈ భవనంలో లోక్ సభ సభ్యుల కోసం 888 సీట్లు, రాజ్య సభ సభ్యుల కోసం 326 సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరిగితే.. లోక్‌సభలో ఒకేసారి 1224 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 18.37 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మించే పార్లమెంట్ విస్టా భవనం ప్రాజెక్టు కోసం రూ.11,794 కోట్లుఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అంతకు మందు మొత్తం రూ.11,038 కోట్లు అవుతుందని అంచనా వేసినా.. ప్రస్తుతం అదనంగా మరో రూ.794 కోట్లు పెరిగింది. సెంట్రల్ సెక్రటేరియట్‌ను 2024కు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.


By December 07, 2020 at 01:33PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/central-vista-project-supreme-court-allows-ground-breaking-ceremony-with-riders/articleshow/79604840.cms

No comments