దేశంలో సగం మంది ఆకలితో ఉంటే కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? మోదీకి కమల్ సూటి ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీపై మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కమల్.. మోదీపై విమర్శలు గుప్పించారు. దేశం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కరోనా వైరస్ కారణంగా జీవనోపాధి కోల్పోయి దేశంలో సగం మంది ఆకలితో ఉంటే రూ.1,000 కోట్లతో పార్లమెంట్ భవనం నిర్మిస్తారా? అని కమల్ మండిపడ్డారు. ‘కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలోని సగం మంది జీవనోపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తుంటే.. రూ.1,000 కోట్లతో కొత్త పార్లమెంట్ భవనం ఎందుకు.. చైనా గోడ కట్టడానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే.. ప్రజల రక్షించడం కోసమే ఈ నిర్మాణమని పాలకులు అన్నారు.. రూ.1000 కోట్లతో ఈ పార్లమెంట్ బిల్డింగ్‌ను ఎవరిని రక్షించడానికి కడుతున్నారు.. ఈ ప్రశ్నకు గౌరవనీయులై ప్రధాని సమాధానం ఇవ్వండి’ అని కమల్ నిలదీశారు. రెండు రోజుల కిందటే కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని భూమిపూజ నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం రూ.20,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చుచేయనుంది. అయితే, ఈ భవనానికి కేవలం శంకుస్థాపన మాత్రమే నిర్వహించాలని, నిర్మాణ పనులు ప్రారంభించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మోదీ లక్ష్యంగా కమల్ విమర్శలు ఎక్కుపెట్టారు. మదురై నుంచి అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడు బాగా వెనుకబడింది.. దానిని మేము తిరిగి గాడిలో పెడతాం.. మేము ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం’అని కమల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయనున్న కమల్.. నిరుద్యోగం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, అవినీతి అంశాలే ప్రధాన అజెండాగా ముందుకెళ్లనున్నారు. ఇక, 2019 సాధారణ ఎన్నికల్లో కమల్ పార్టీకి దాదాపు 4 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. తమిళనాడులో తమ ఉనికి చాటుకోడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నేత కుష్బూ బీజేపీలో చేరారు.
By December 13, 2020 at 01:19PM
No comments