Breaking News

రైతులతో మూడో దఫా చర్చలు.. మంత్రులతో ప్రధాని కీలక భేటీ


కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రైతులతో కేంద్రం రెండు దఫాలుగా చర్చలు జరిపింది. అయినా, ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ అన్నదాతలతో సంప్రదింపులు జరిపినా చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఈసారి ప్రధాని నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. మరికొద్ది గంటల్లో రైతులతో మూడో విడత చర్చలు జరగనుండగా.. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో ప్రధాని సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. రైతు సంఘాలు లేవనెత్తిన అంశాలు, చట్టాల రద్దు డిమాండ్ల విషయంలో వ్యవహరించాల్సిన వైఖరిపై ప్రధానితో మంత్రులు మాట్లాతున్నట్టు సమాచారం. గత తొమ్మిది రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ కర్షకుల నిరసన ఉద్ధృతమవడంతో గత మంగళవారం, గురువారం కేంద్రం వారితో చర్చలు జరిపి, కొత్త చట్టాలపై వివరణ ఇచ్చింది. అయితే, కేంద్రం ఇచ్చిన వివరణను రైతులు తిరస్కరించడంతో చర్చలు ఫలించలేదు. దీంతో శనివారం మధ్యాహ్నం మరోసారి కేంద్రం చర్చలు జరపనుంది. నూతన సాగు చట్టాలతో పాటు విద్యుత్‌ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని రైతులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డిసెంబరు 8న భారత్‌ బంద్‌ చేపట్టాలని రైతులు ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు నేడు పార్లమెంట్‌‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, రైతుల ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది.


By December 05, 2020 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prime-minister-narendra-modi-meets-with-shah-rajnath-singh-ahead-of-talks-with-farmers/articleshow/79578176.cms

No comments