ఆస్ట్రేలియా నుంచి కైలాస దేశానికి గరుడ చార్టర్ ఫ్లైట్స్.. నిత్యానంద బంపరాఫర్
అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ, ఏడాది కాలంగా పరారీలో ఉన్నా వివాదాస్పద నిత్యానందస్వామి.. కైలాస పేరుతో ఓ ప్రత్యేక హిందూ దేశాన్ని ఏర్పాటుచేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస్‌ను ఈ ఆగస్టులో ప్రారంభించాడు. ఇదిలా ఉండగా.. ఓ దీవిలో ఏర్పాటు చేసిన కైలాస దేశానికి సందర్శకులకు వీసాల జారీ ప్రారంభించినట్టు తాజాగా ప్రకటించాడు. ఈ కైలాస పేరిట ఓ ఈమెయిల్ ఐడీ కూడా సృష్టించిన .. వీసాకు దీని ద్వారా దరఖాస్తు చేయాలని సూచించాడు. ఆస్ట్రేలియా నుంచి కైలాస దీవికి గరుడ పేరిట ఛార్టర్ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు నిత్యానంద వెల్లడించారు. కైలాస దేశం ఎక్కడున్నదీ స్పష్టంగా తెలియకపోయినా.. ఈ దీవి ఆస్ట్రేలియాకు సమీపంలో ఉన్నట్లు భావిస్తున్నారు. కైలాస దీవిలో ఎవరికైనా వసతి కల్పిస్తారని, అయితే కేవలం మూడు రోజులకు మించి ఉండటానికి అనుమతించమని నిత్యానంద పేర్కొన్నారు. కైలాస దేశాన్ని సందర్శించాలనుకుంటే ఆస్ట్రేలియా వరకు సొంత ఖర్చులతో రావాలని, అక్కడ నుంచి తామే స్వయంగా దీవికి తీసుకెళతామని ఆఫర్ ఇచ్చారు. దీవికి వచ్చేవారిని పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తామని నిత్యానంద పేర్కొవడం గమనార్హం. kailaasa.orgపేరిట అధికారిక వెబ్ సైట్ సైతం ప్రారంభించారు. ఆగస్టు నెలలో రిజర్వుబ్యాంకు ప్రారంభించిన వీడియోను నిత్యానంద విడుదల చేశారు. కైలాస దీవిలో ఇంగ్లీషు, సంస్కృతం, తమిళభాషలను అధికారిక భాషలుగా గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. పలు దేశాలలో హిందూ మతాన్ని నిశ్చయంగా పాటించే హక్కును కోల్పోయిన ప్రజలంతా కలిసి కైలాస దేశాన్ని ఏర్పాటుచేసినట్టు kailaasa.orgలో పేర్కొన్నారు. ఈ దీవిలో 100 మిలియన్ల మంది ఆది శైవులు ఉన్నారని, 2 బిలియన్ల మంది హిందూ మతాన్ని అభ్యసిస్తున్నారని తెలిపారు. దక్షిణ ఆసియాలోని 56 వేద దేశాలతో పాటు ప్రపంచ హిందూ మతం ఉనికి కలిగి ఉందని పేర్కొంది. కైలాస దేశానికి సొంత క్యాబినెట్ ఉందని, ఇందులో ఆరోగ్య శాఖ, రాష్ట్ర విభాగం, సాంకేతిక విభాగం, జ్ఞానోదయ నాగరికత విభాగం, విద్యా శాఖ, మానవ సేవల విభాగం, హౌసింగ్ విభాగం, వాణిజ్య విభాగం, ఖజానా విభాగం ఉన్నాయని తెలిపింది. రిషభ ధ్వజ- కైలాస జెండాలో నిత్యానందతో పాటు దేశ జాతీయ జంతువు నంది కూడా ఉంది.
By December 18, 2020 at 11:42AM
No comments