మహిళ సాయంతో దేశంలో దాడులకు మలేషియా ఉగ్రవాదులు కుట్ర.. భగ్నం చేసిన ‘రా’
దేశంలో ఉగ్రదాడులకు మలేసియా కేంద్రంగా జరుగుతున్న భారీ కుట్రను భారత నిఘా వర్గాలు భగ్నం చేశాయి. భారత్‌లో ఉగ్రకార్యకలాపాల కోసం మలేసియాకు చెందిన ఓ ఉగ్ర సంస్థ 2 లక్షల డాలర్లు లావాదేవీలు జరిపినట్టు రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) గుర్తించింది. ఇందులో భాగంగా కొంత మొత్తాన్ని చెన్నైకి చెందిన ఓ హవాలా డీలర్ అందుకున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కౌలాలంపూర్‌కు చెందిన రోహింగ్యా నేత మొహమ్మద్ నసీర్, వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌లు ఈ లావాదేవీల వెనుక ఉన్నట్టు రా పరిశీలనలో తేలింది. ఓ మహిళకు మయన్మార్‌లో మలేసియా ఉగ్రవాద సంస్థలు శిక్షణ ఇచ్చాయని, భారత్‌లో దాడులకు ఈమె నాయకత్వం వహిస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి. నేపాల్, లేదా బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా భారత్‌లో ప్రవేశించాలనేది ఉగ్రవాదుల ప్రణాళికగా రా పేర్కొంది. ఢిల్లీ, అయోధ్య, బోధ్ గయ, పశ్చిమ బెంగాల్‌లోని ముఖ్య నగరాలు, శ్రీనగర్‌లో దాడులకు వ్యూహరచన చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి. కొద్ది వారాల్లో దేశంలో దాడులకు డిసెంబరు మధ్య లేదా చివరి వారంలో ఉగ్రవాదులు ప్రవేశించడానికి వ్యూహరచన చేసినట్టు హెచ్చరించాయి. ఉగ్రదాడికి శిక్షణ పొందిన మహిళ ఎవరనేది స్పష్టంగా తెలియకపోయినా.. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె మలేషియా నుంచి మాయన్మార్ వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. వీరు భారత్‌లోని చొరబడటానికి దేశంలోని కొన్ని సంస్థలు సహకరించవచ్చని అనుమానిస్తున్న ఐబీ.. వాటిపై దృష్టిసారించింది. మలేషియాలోని రోహింగ్యా శరణార్థుల కోసం నిధుల సేకరణ విషయం గతేడాది ఐబీ దృష్టిలోకి వచ్చినా రోహింగ్యా ఉగ్రవాద సంస్థ ప్రస్తుత లావాదేవీల్లో పాల్గొంటుందో? లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి ఆరోపణలపై జకీర్ నాయక్ 2016 నుంచి మలేషియాలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.
By December 13, 2020 at 11:46AM
No comments