తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి వేడుకలు.. ఉత్తరద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
ప్రతి నెలలో ఏకాదశి రెండుసార్లు వస్తుంది.. అంటే ఏడాదికి 24 లేదా 26 చొప్పున వస్తాయి. వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది.. మోక్షప్రదమైనది.. అత్యంత పవిత్రమైనది. మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏడాది ఏకాదశి (శుక్రవారం) ఆ రోజంతా ఉంటుందని, అశ్వనీ నక్షత్రమని పండితులు చెబుతున్నారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఈ ఏకాదశి.. చింతామణిలా కోర్కెలను తీర్చి, సమస్త పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. కలియుగ వైకుంఠం భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. దీంతో వేకువ జామున 3.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. తొలుత వీఐపీల దర్శనాలు ప్రారంభమయ్యాయి. సుమారు రెండున్నర వేల మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనానికి హాజరైనట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆయన తెలిపారు. ఈ ఏడాది ఉత్తర ద్వార దర్శనం జనవరి 3 వరకు భక్తులకు స్వామివారి ఉత్తర దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి టోకెన్లను టీటీడీ ఇప్పటికే జారీ చేసింది. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తిరుమలలోని 4 మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు. శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. సింహాచలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ ముక్కోటి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అటు తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గరుడ వాహనంపై రామయ్య, సీతమ్మ, హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇస్తున్నారు. స్వామివారిని ఉత్తరద్వారం నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉదయం 6.43 గంటల నుంచి స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులు పోటెత్తారు.
By December 25, 2020 at 06:43AM
No comments