నేడు ‘బురేవి’ తుఫానుగా వాయుగుండం.. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.. మంగళవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు 2 సాయంత్రం ఇది శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఇది నైరుతి దిశగా గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని.. ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమైలీకు 590 కి.మీ. దూరంలో, తమిళనాడులోని కన్యాకుమారికి 1000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత పశ్చిమ- వాయువ్వ దిశగా పయనించి ఇది బుధవారం సాయంత్రం లేదా రాత్రి తర్వాత శ్రీలంక వద్ద తీరాన్ని తాకనుంది. ఆ తరువాత దాదాపు పశ్చిమ దిశగా మళ్లి.. డిసెంబరు 3 న కొమొరిన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.. ఈ తుఫాన్‌కు ‘బురేవి’గా నామకరణం చేయనున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 75-85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బురేవి తుఫాన్ ప్రభావంతో డిసెంబరు 2,3 తేదీల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, డిసెంబరు 2,3 తేదీలలో ఏపీలోని దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాను ప్రభావం కన్యాకుమారి, తిరునాల్వేలి, తూతుకూడి, టెంకాసీ, రామనాథపురం, శివగంగయ్ ప్రాంతంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. డిసెంబరు 2 నుంచి 4 వరకు కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పత్తనంథిట్టా, అలప్పూజలో, దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, మహే, కరైకల్, ఉత్తర కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుఫాన్ తీరం వైపు తరలివస్తున్న సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ అధికారులు తెలిపారు. డిసెంబరు 1 నుంచి మత్స్యకారులెవరూ బంగాళఖాతంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించారు.
By December 01, 2020 at 06:45AM
No comments