Breaking News

నేడు ఆకాశంలో మహా అద్భుతం.. 800 ఏళ్ల తర్వాత ఆ గ్రహాలు రాత్రివేళ సంయోగం


ఈ ఏడాది ఖగోళ అద్భుతాల పరంపర కొనసాగుతోంది. దాదాపు నాలుగు శతాబ్దాల తర్వాత ఆకాశంలో జరిగే అద్భుతానికి 2020 ఏడాది సాక్షీభూతంగా నిలవనుంది. నేడు డిసెంబరు 21న అతి సమీపంగా వచ్చి అత్యంత ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాయి. క్రీ.శ.1623 తర్వాత ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరగా రావడం ఇదే తొలిసారని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రపంచమంతా ఆసక్తిచూపుతోంది. భూమి నుంచి చూస్తే ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా సమీపించే దృశ్యాన్ని కంజక్షన్‌గా పిలుస్తారు. ఇలా గురు-శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం గ్రేట్‌ కంజక్షన్‌గా అభివర్ణిస్తారు. ఆ సమయంలో భూమి నుంచి చూస్తున్నప్పుడు.. రెండు గ్రహాలు 0.1 డిగ్రీల మేర మాత్రమే దూరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చివరిసారిగా ఇవి క్రీ.శ1623లో ఇంత దగ్గరగా రాగా.. ఇలాంటి సంయోగం రాత్రివేళ జరగడం.. 800 ఏళ్లలో ఇదే తొలిసారి. సోమవారం అత్యంత సమీపానికి వచ్చినప్పుడు వీటి మధ్య దూరం దాదాపు 73.5కోట్ల కిలోమీటర్ల ఉంటుంది. ఆ సమయంలో గురు గ్రహం ముందుభాగం భూమికి 89 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్లీ ఈ గ్రహాలు 2080 మార్చి 15న ఈ స్థాయిలో చేరువగా వస్తాయి. మిగతా గ్రహాలకు భిన్నంగా గురుడు, శని ‘కలయిక’ చాలా అరుదు. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం బృహస్పతి (గురు) సూర్యుని నుంచి ఐదోది. దాని తర్వాత రెండో అతిపెద్ద గ్రహం శని.. సూర్యుని నుంచి ఆరోది. సూర్యుని చుట్టూ తిరగడానికి గురుడికి 12 ఏళ్లు పడితే, శనికి 30 ఏళ్ల సమయం పడుతుంది. పరిభ్రమణ సమయంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఇవి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. అత్యంత దగ్గరగా ఒకే వరసలో ఉన్నట్లు కనిపించడం మాత్రం అరుదు. ఇది సోమవారం ఆవిష్కృతం కానుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ గ్రేట్ కంజక్షన్‌ను నేరుగా కంటితో చూడవచ్చు. సోమవారం సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల వరకు నైరుతి, పశ్చిమ దిక్కుల్లో రెండు గ్రహాలు భూమికి దగ్గరగా వచ్చినట్టు దర్శనమిస్తాయి. గురు గ్రహం పెద్దగా, ప్రకాశవంతమైన నక్షత్రంలా.. దానికి ఎడమవైపున కొద్దిగాపైన శని కాస్త మసకగా కనిపిస్తుంది. రెండింటినీ స్పష్టంగా, విడివిడిగా చూడాలంటే బైనాక్యులర్‌ను ఉపయోగించాలి. చిన్నపాటి టెలిస్కోపును వాడితే గురు గ్రహం చుట్టూ ఉన్న నాలుగు పెద్ద చందమామలూ కనిపిస్తాయి. ప్రతి నెల చంద్రుడు (భూమికి ఉపగ్రహం)-అంగారకుడు; చంద్రుడు-గురు; చంద్రుడు-శని సహా ఇతర గ్రహాలు దగ్గరగా ఉన్నట్టు కనిపించడం సర్వసాధారణం. చంద్రుడు కాకుండా మిగతా గ్రహాలు కూడా ఒక్కోసారి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. ఇందులో భాగంగానే మనకు గతకొద్ది కాలంగా గురు-శని గ్రహాలు దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. భూమికి చంద్రుడికి మధ్య దూరం దాదాపు 3,84,000 కిలోమీటర్లు కాగా.. ఇతర గ్రహాలు లక్షలు, కోట్ల కి.మీ దూరంలో ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఇలా తిరిగే సమయంలో ఏవేని రెండు గ్రహాలు ఒక్కోసారి కొంత దగ్గరగా చేరుకుంటాయి. అయినప్పటికీ వాటిమధ్య లక్షల కి.మీ దూరం ఉంటుంది.


By December 21, 2020 at 07:05AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/jupiter-saturn-great-conjuction-on-today-after-397-years-how-to-watch-india/articleshow/79831537.cms

No comments