Breaking News

ఎస్పీ బాలు తొలి పాటకు 54ఏళ్లు.. సరిగ్గా ఇదే రోజు


గాన గంధర్వుడు కరోనా బారిన పడి ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు ప్రేక్షకులను, అభిమానులను కలకాలం అలరిస్తూనే ఉంటాయి. ఆ పాటలు వింటుంటే ఆయన ఇంకా మన మధ్యే ఉన్నారన్న భావన కలుగుతూ ఉంటుంది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన ఆ గొంతు మూగబోయిందంటే ఇంకా నమ్మశక్యం కావడం లేదు. కేవలంగా గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగంలోనే ఆయన ఓ ప్రత్యేక అధ్యాయం. సినిమాల్లో తొలి పాట పాడి నేటికి (డిసెంబర్ 15) సరిగ్గా 54ఏళ్లు పూర్తయ్యాయి. ఓ పాటల పోటీలో పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం ప్రతిభను పసికట్టిన సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంలో తొలిసారిగా ఆయనతో పాడించారు. అలా 1966, డిసెంబర్‌ 15న సాయంత్రం 6 గంటలకు బాలు తొలి పాట ‘ఏమి ఈ వింత మోహం’ రికార్డ్‌ అయింది. అప్పటివరకూ ఘంటసాల పాటకు అలవాటు పడిన తెలుగు సంగీత ప్రేక్షకులను ఆ కొత్త స్వరం ఆకర్షించింది. దీంతో ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. అలా 54ఏళ్ల పాటు 40వేలకు పైగా పాటలు పాడిన ఆయన ఏ గాయకుడికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుని దివికేగారు.


By December 15, 2020 at 07:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/s-p-balasubrahmanyam-first-song-completed-54-years/articleshow/79731911.cms

No comments