Breaking News

దేశంలో కొత్త కరోనా: ఢిల్లీ నుంచి రైల్లో వచ్చిన రాజమండ్రి మహిళ.. పుణేలో 109 మంది మిస్సింగ్


దేశంలోకి యూకే కరోనా స్ట్రెయిన్ ప్రవేశించడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళకు (47) కొత్తరకం కరోనా నిర్ధారణ కాగా.. ఆమెతో కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. పుణేలోనూ ఓ వ్యక్తికి కొత్తరకం స్ట్రెయిన్ నిర్ధారణ అయ్యింది. అయితే, గడచిన 15 రోజులుగా యూకే నుంచి పుణేకు వచ్చిన మరో 109 మంది గురించి అధికారులు శోధిస్తున్నారు. వారి కాంటాక్ట్ వివరాలు లేకపోవడంతో ఫోన్ ద్వారా సంప్రదించే వీల్లేకుండా పోయింది. దీంతో మున్సిపల్ అధికారులు పోలీసుల సాయం తీసుకోనున్నారు. ఒడిశా అధికారుల సైతం ఇటువంటి సమస్యే ఎదుర్కొంటున్నారు. మొత్తం 74 మందికిపైగా యూకే నుంచి వచ్చినట్టు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జాబితాలో పేర్కొన్నారు. వీరికోసం ఆరు బృందాలను ఏర్పాటుచేసినా.. గుర్తించడం కష్టంగా మారింది. యూకే సర్వీస్ ప్రొవైడర్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బ్రిటన్ నుంచి 1426 మంది రాగా.. ఇప్పటి వరకు 1406 మందిని గుర్తించామని ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కే భాస్కర్ తెలిపారు. వీరిలో కాంటాక్ట్ అయిన 6,364 మంది కూడా గుర్తించామని అన్నారు. పుణే మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మిస్సయిన వీరంతా ముంబయి విమానాశ్రయంలో దిగి, రోడ్డు మార్గం ద్వారా పుణేకు చేరినట్టు తెలిపారు. వీరిని ఎక్కడున్నారని గుర్తించడానికి అధికార బృందాలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పీఎంసీ నిబంధనల ప్రకారం.. పశ్చిమ ఆసియా, ఐరోపా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ సొంత ఖర్చులతో తప్పనిసరిగా వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఏడు రోజులు ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ తొలుత యూకే నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చింది. తర్వాత ఢిల్లీ-విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలులో డిసెంబరు 22న రాజమండ్రి చేరుకుంది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. దీంతో ఆమె ఎక్కడుందో తెలుసుకోడానికి అధికారులు కష్టపడాల్సి వచ్చింది. ఏలాగోలా ఆమెను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. రాజమండ్రికి డిసెంబరు 24 తెల్లవారుజామున తన కుమారుడితో సహా మహిళ చేరుకుంది. తొలుత కుమారుడు ఆమెను ఢిల్లీ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుని, ఇద్దరూ రైలెక్కారు. దాదాపు 1,800 కిలోమీటర్ల ప్రయాణంలో చాలా మందితో వీరు కాంటాక్ట్ అయి ఉంటారు. తల్లీకుమారులు ఇద్దర్నీ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో వేర్వేరుగా ఐసోలేషన్ గదుల్లో ఉంచారు.


By December 30, 2020 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/andhra-pradesh-flyer-who-fled-delhi-igi-has-uk-strain-109-untraced-in-pune/articleshow/80020863.cms

No comments