Breaking News

KCR ‘చిరు’ వ్యూహం.. పవన్‌‌కు చెక్‌పెట్టిన గులాబీ బాస్.. మండిపడుతున్న ఫ్యాన్స్!


కరోనాతో కుదేలైన సినీ రంగానికి వరాల జల్లు కురిపించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మెగాస్టార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ విజన్‌కు తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ పురోగతి సాధించి.. దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మామూలు రోజుల్లోనైతే చిరంజీవి ట్విట్టర్ ద్వారా చేసిన ఈ వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట ఇతర సినీ పెద్దలతో కలిసి చిరంజీవి సీఎంను కలవడం.. ఇప్పుడిలా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు చిరంజీవి ఇంటి పార్టీ అయిన జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించింది. బల్దియా బరిలో జనసేన నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికీ.. అనవసరంగా ఓట్లు చీలుతాయనే భావనతో.. బీజేపీ మాత్రమే పోటీ చేసేలా పవన్ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. జనసేనాని తమ పూర్తి మద్దతును బీజేపీకి ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయనప్పటికీ.. బీజేపీకి మద్దతు ప్రకటించడం ద్వారా కేసీఆర్ సర్కారుకు ప్రత్యర్థిగా నిలిచినట్టే. కానీ అదే సమయంలో ఆయన సోదరుడు చిరంజీవి మాత్రం కేసీఆర్ సర్కారును ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం.. రామ్ చరణ్ సైతం సీఎంకు థ్యాంక్స్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయంగా తమ్ముడి పార్టీకే తన మద్దతు ఉంటుందని చిరంజీవి గతంలోనే ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. అటు ఆంధ్రా సీఎం జగన్‌తో, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ సన్నిహితంగానే మెలుగుతున్నారు. గతంలో చిరంజీవి సతీసమేతంగా వెళ్లి జగన్‌ను కలిసి రావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ ప్రత్యర్థి అని తెలిసినా.. చిరంజీవి జగన్‌ను కలవడం ఆశ్చర్యం కలిగించింది. తాను అందరివాడినని చిరు చాటే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ఆయన చేసే పనులు జనసేనానికి ఇబ్బందికరంగా మారుతున్నాయని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్‌ను మెగాస్టర్ ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ పట్ల కొందరు ఫ్యాన్స్ సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరు మాత్రం కేసీఆర్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల ముందే సినీ పరిశ్రమ గుర్తొచ్చిందా..? అని ప్రశ్నిస్తున్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడానికి వరాలు గుప్పించిన కేసీఆర్.. రైతుల సమస్య గురించి స్పందించరేం? అని నిలదీస్తున్నారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు, నగరంలోని రోడ్ల పరిస్థితి గురించి.. మీరెందుకు అడగడం లేదని చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు.


By November 24, 2020 at 11:37AM


Read More https://telugu.samayam.com/telangana/news/ghmc-elections-janasena-supports-bjp-but-chiranjeevi-thanked-kcr-for-relief-measures-to-film-industry/articleshow/79383100.cms

No comments