Kamal Haasan: నటనలో నీకు నువ్వే సాటి.. లేరెవరూ పోటీ.. హ్యాపీ బర్త్‌డే లెజెండ్

విశ్వనటుడు కమల్ హాసన్. ఆయన గురించి ప్రస్తావించడానికి ఇంతకంటే ఏం కావాలి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను నిజం చేస్తూ బాలనటుడిగానే తనలోని సత్తాను వెండితెరకు పరిజయం చేసిన ఆయన హీరోగా మారిన తర్వాత తనలోని నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. నటుడిగా ఆయన చేసినన్న ప్రయోగాలు దేశంలో మరే నటుడూ చేయలేదు. నటనలో అరుదైన ప్రయోగాలు చేసిన ఘనత ఆయనది. నటుడిగానే కాకుండా దర్శకుడు, డ్యాన్సర్‌గా, నిర్మాత, స్క్రీన్ రైటర్, సింగర్, రాజకీయ నేతగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న పుట్టినరోజు నేడు(నవంబర్ 7). తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమక్కుడిలో 1954, నవంబర్ 7వ తేదీన జన్మించిన కమల్ హాసన్ బాలనటుడిగా నటించిన తొలి సినిమాకే జాతీయ పురస్కారం అందుకున్నాడు. హీరోగా మారిన తర్వాత ‘అవర్‌గళ్’, ‘అవళ్ ఓరు తొడరర్‌కదై’, ‘సొల్ల తాన్ నినైక్కిరేన్’, ‘మాణవన్’, ‘కుమార విజయం’ లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవితో నటించిన ‘16 వయదినిలె’ (తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’) మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీదేవితో ఆయన ఏకంగా 23 చిత్రాల్లో కలిసి నటించారు. దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన ‘మరో చరిత్ర’ అనే తెలుగు చిత్రంలో నటించి మెప్పించారు. Also Read: మూండ్రంపిరై, నాయకన్ (నాయకుడు), ఇండియన్ (భారతీయుడు) చిత్రాలకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు సార్లు అందుకున్నారు. సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకుగాను 1983, 1985లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి పురస్కారం పొందారు. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డును రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన ఆరు సినిమాలు భారతదేశం తరపున ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లాయి. దేశంలో మరే నటుడికీ దక్కని గౌరవమిది. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్‌హసన్‌ను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. 2005లో మద్రాసులోని సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నారు. తమిళ సినిమాకు చేసిన సేవలకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని కలైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదుతో సత్కరించింది. భారతీయ సినిమాను జగద్విఖితం చేసిన ఈ మహానటుడు మరెన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే కమల్ హాసన్
By November 07, 2020 at 10:47AM
No comments