Breaking News

GHMC Elections: టీఆర్ఎస్ మేనిఫెస్టో కావాలా..?: కాంగ్రెస్ నేత ఆసక్తికర ట్వీట్


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు బరిలో దిగుతున్నాయి. మేయర్ పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుండగా.. ఈసారి ఎలాగైనా హైదరాబాద్‌లో కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ తహతహలాడుతోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం పోటీకి సై అంటోంది. మూడు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో గ్రేటర్ వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ సైతం అధికార టీఆర్ఎస్‌పై విమర్శల దాడి పెంచింది. తమ హయాంలోనే హైదరాబాద్‌లో ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోలేదని.. కర్ఫ్యూలు విధించలేదని.. నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అభివృద్ధితో కూడిన హైదరాబాద్ కావాలా..? లేదంటే మత ఘర్షణలతో అట్టుడికే హైదరాబాద్ కావాలో తేల్చుకోండని ప్రజలకు సూచిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత ట్విట్టర్ ద్వారా టీఆర్ఎస్‌కు చురకలు అంటించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కేటీఆర్ రిలీజ్ చేసిన టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆ పార్టీ వెబ్‌సైట్లో కనిపించడం లేదని కోమటిరెడ్డి తెలిపారు. మీకు ఎవరికైనా ఆ పార్టీ మేనిఫెస్టో కావాలంటే తనకు మెయిల్ ఐడీలను పంపాలని సూచించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో.. హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ అందిస్తామని.. నగరమంతా ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి తెస్తామని.. హుస్సేన్ సాగర్‌ను మంచి నీటి చెరువుగా మారుస్తామని.. మూసీనదిని పునరుద్ధరిస్తామని.. మూసీ నది వెంబడి నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామని.. టీఆర్ఎస్ హామీ ఇచ్చింది.


By November 20, 2020 at 09:05AM


Read More https://telugu.samayam.com/telangana/news/congress-leader-komatireddy-venkat-reddy-satirical-tweet-on-trs-party-2016-ghmc-elections-manifesto/articleshow/79314856.cms

No comments