Breaking News

సీఎం పదవిపై ఆశ వదులుకోని తేజస్వీ: ఆ పార్టీలకు బంపరాఫర్లు.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా?


బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించినా.. మహాకూటమి గట్టిపోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కేవలం 0.03 శాతం ఓట్లతోనే మహాకూటమికి విజయం దూరమయ్యింది. అయితే, యువనేత తేజస్వీ యాదవ్‌ మాత్రం బిహార్ ముఖ్యమంత్రి పదవిపై ఆశలు వదలుకోలేదని తెలుస్తోంది. ఎన్‌డీఏలోని చిన్న పార్టీలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఎన్డీఏలోని ముకేష్ సాహ్ని నాయకత్వంలో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ, మాజీ సీఎం జీతన్‌రామ్ మాంఝీ హిందూస్థాన్ అవామీ మోర్చాలతో తేజస్వీ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆర్జేడీ వర్గాలు అంటున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఆ పార్టీల నుంచి ఎటువంటి సానుకూలత వ్యక్తం కాలేదని, ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నాయి. ముకేష్ సాహ్ని డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటే ఆ పదవి ఆయనకు అప్పగిస్తామని వ్యాఖ్యానించాయి. ప్రస్తుతం మహాకూటమికి 110 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 12 మంది మద్దతు అవసరం. ఒకవేళ వీఐపీ, హెచ్ఏఎంలు తమకు మద్దతు ఇస్తే, అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఏఐఎంఐఎంను తమతో కలుపుకుంటామని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల ముందే ఈ రెండు పార్టీలు మహాకూటమి నుంచి విడిపోయి ఎన్‌డీఏలో చేరాయి. వీఐపీ చీఫ్ ముకేష్ సాహ్ని సిమ్రి భక్తియార్‌పూర్ నుంచి ఆర్జేడీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. వీఐపీ, హెచ్ఏఎంలు తమ వెంట వస్తే ఎన్డీయే కంటే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని ఆర్జేడీ వర్గాలు పేర్కొంటున్నాయి. మహాకూటమికి మద్దతు ఇవ్వడానికి ఎంఐఎం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్జేడీ ప్రతిపాదనను వీఐపీ వర్గాలు ధ్రువీకరించాయి. కానీ, ఇది సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డాయి. డిప్యూటీ సీఎం, మంత్రి పదవులను ఆఫర్ చేశారు.. దీనిపై మా పార్టీ నేతలతో చర్చించనున్నామని తెలిపాయి. ఆర్జేడీ నుంచి విడిపోయి ఎన్‌డీఏతో కలిసిన తమకు ఎటువంటి ఇబ్బందిలేదని, ఒకవేళ ఇంత తొందరగా మనసు మార్చుకుంటే క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. హెచ్ఏఎం నేత కూడా ఆర్జేడీ నుంచి తమకు ప్రతిపాదన వచ్చినట్టు ధ్రువీకరించారు. కానీ, తిరిగి ఆర్జేడీ వెంట వెళ్లే ప్రసక్తేలేదన్నారు. తమకు జరిగిన అవమానాన్ని మరిచిపోలేమని, ఎన్‌డీఏ నీడలోనే తమకు నిశ్చితంగా ఉంటుందని అన్నారు


By November 12, 2020 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rjd-touched-with-mukesh-sahni-and-jeetan-ram-manjhi-tejashwi-has-not-given-up-hope-of-becoming-cm/articleshow/79185478.cms

No comments