Breaking News

అమిత్ షా ప్రొఫైల్ పిక్ తొలగించిన ట్విట్టర్.. తాత్కాలికంగా నిలిచిపోయిన అకౌంట్!


సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో కేంద్ర హోం మంత్రి అకౌంట్ గురువారం తాత్కాలికంగా నిలిచిపోయింది. అమిత్ షా ఖాతాలో కొద్దిసేపు ఆయన ప్రొఫైల్ ఫోటో మాయం కావడంతో గందరగోళం నెలకుంది. ‘ఓ కాపీరైట్ హోల్డర్ నుంచి వచ్చిన ఫిర్యాదు’తో ఆ ఫోటోను తొలగించినట్టు ట్విటర్ పేర్కొంది. అమిత్ షా వెరిఫైడ్ ఖాతాలో పిక్చర్ డిస్‌ప్లే మీద క్లిక్ చేస్తే ఓ చిన్న సందేశం కనిపించింది. ‘మీడియా కనిపించదు. ఓ కాపీరైట్ హక్కుదారుడి నుంచి అందిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా ఈ ఫోటోను తొలగించడం జరిగింది’అంటూ పేర్కొంది. అయితే కాసేపటి తర్వాత అమిత్ షా తన ప్రొఫైల్‌ ఫోటోను పునరుద్ధరించారు. దీనిపై ట్విటర్ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.‘సాధారణంగా, ఎలాంటి ఫోటో అయినా సరే.. అందులో ఏముందనేది కాదు.. సదరు ఫోటోను తీసిన వ్యక్తే దాని అసలు హక్కుదారుడు...’ అని ట్విటర్ కాపీరైట్ పాలసీ చెబుతోంది. ఇటీవల ఇదే తరహా కాపీరైట్ వివాదంతో బీసీసీఐ అధికారిక ఖాతా నుంచి డిస్‌ప్లై ఫిక్చర్‌ను ట్విటర్ యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. ‘అనుకోకుండా తలెత్తి సమస్య కారణంగా ప్రపంచ కాపీరైట్ పాలసీని అనుసరించి ఈ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశాం.. దీనిని తక్షణమే పరిష్కరించి, ఖాతాను మళ్లీ పూర్తిస్థాయిలో పునరుద్దరించాం’ అని ట్విట్టర్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. షా ఖాతా నిలిచిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, లేహ్‌ ప్రాంతాన్ని జమ్మూ కశ్మీర్‌లో చూపినందుకు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ ఈ నెల 9న ట్విటర్‌కు నోటీసులు జారీచేసింది. లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో చూపడానికి బదులుగా కశ్మీర్‌లో చూపడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలా తప్పుగా ఎందుకు చూపారో ఐదు రోజుల లోపు వివరణ ఇవ్వాలని గడువు విధించింది.


By November 13, 2020 at 12:22PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-minister-amit-shah-twitter-account-locked-due-to-inadvertent-error/articleshow/79205754.cms

No comments