పెళ్లి రోజు.. భార్య కళ్లెదుటే భర్త మరణం.. కృష్ణా జిల్లాలో విషాదం
పెళ్లి రోజు ఆనందంగా గడపాలనుకున్న ఆ జంటకి కన్నీరు మిగిల్చింది. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడం ఆ భార్యని జీవచ్ఛవాన్ని చేసింది. భార్య, కొడుకు, కూతురుతో సొంతూరు బయల్దేరిన కానిస్టేబుల్ ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ అత్యంత విషాద ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. జిల్లాలోని మొవ్వ మండలం గూడపాడుకి చెందిన కేశాని అమరేశ్వరరావు విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి రోజు కావడంతో కొద్దిరోజుల కిందట పుట్టింటికి వెళ్లిన భార్య, కొడుకు, కూతురుని తీసుకొచ్చేందుకు మోపిదేవి మండలం కె.కొత్తపాలెం వెళ్లాడు. భార్యాబిడ్డలను బైక్‌పై ఎక్కించుకుని ఎక్కించుకుని సొంతూరు గూడపాడు బయల్దేరాడు. ఘంటసాల మండలం చిట్టూర్పు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న అమరేశ్వరరావును ఎదురుగా చల్లపల్లి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమరేశ్వరరావు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య లావణ్య, కూతురు భవిష్యకు తీవ్రగాయాలయ్యాయి. కొడుకు తనీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కళ్లెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి ఆ భార్య గుండె పగిలింది. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి ఆమె రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కూతురు భవిష్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి రోజే ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మరో ఆరు రోజుల్లో అమరేశ్వరరావు సోదరుడి వివాహం జరగాల్సి ఉంది. ఆయన మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కానిస్టేబుల్ మరణంతో సొంతూరు గూడపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. Also Read:
By November 20, 2020 at 09:53AM
No comments