వాట్సాప్ ఛాటింగ్‌ను సాక్ష్యంగా పరిగణించలేం.. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు సంచలన వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆస్ట్రేలియా ఆర్కిటెక్ట్ పౌల్ బార్టెల్స్‌కు నార్కోటిక్ డ్రగ్స్, సైకోథెరపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. సహ నిందితుడితో అతడు జరిపిన వాట్సాప్ చాట్‌లు సాక్ష్యాలు కావని, డ్రగ్ సరఫరా చేస్తున్నట్టు అరెస్ట్ చేయడానికి ఇవి సరిపోవని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. ఆస్ట్రేలియా ఆర్కికెట్ట్ పౌల్ బార్టెల్స్‌ను గతవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ అమ్మినట్టు ఆరోపణలతో అతడిని ఎన్డీపీసీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి అదుపులోకి తీసుకున్న సమయంలో అతడి నివాసంలో అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేవలం వాట్సాప్ చాట్‌లను ఆధారాలుగా పేర్కొన్నారు. డ్రగ్స్ గురించి వాట్సాప్ గ్రూప్‌లో చర్చించినట్టు తెలిపారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుతో దీనికి సంబంధం ఉన్నట్టు ఎన్‌సీబీ అనుమానిస్తోంది. ‘నిందితుల నుంచి ఎటువంటి ఆధారాలు, నిషేధిత పదార్థాలు లభించలేదు.. సహ-నిందితులు, వాట్సాప్ చాట్ తప్ప డ్రగ్స్ అమ్మినట్టు, సరఫరా చేసినట్టు పరిగణించడానికి స్పష్టమైన ఆధారాలు లేవు.. కాబట్టి అతడికి బెయిల్ నిరాకరించడం సమంజసం కాదు’ అని ఎన్సీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హెచ్‌ఎస్ సాత్‌బాయ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో బార్టెల్స్ పాత్రపై భవిష్యత్తులో ఏదైనా ఆధారాలు, రుజువులను ఎన్సీబీ అధికారులు సేకరిస్తే తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంటుందని పేర్కొంది. ‘నిందితుడిని అరెస్టు చేసిన తరువాత, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన అధికారులు అతడిని కస్టడీకి కోరలేదు.. నిందితులను విచారించడానికి, తదుపరి దర్యాప్తునకు ఎన్‌సీబీ వద్ద ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవని తెలియజేస్తుంది.. తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని నిందితుడు తెలిపాడు’ అని న్యాయమూర్తి అన్నారు. బార్టెల్స్ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు అబడ్ పాండే, సుభాష్ జాదవ్‌లు.. గత ఆరేళ్లుగా దేశంలో ఉంటున్న బార్టెల్స్ ఎటువంటి వివాదాల్లో చిక్కుకోలేదని, తప్పుడు ఆరోపణలతో అతడిని జైల్లో పెట్టారని వాదించారు. ఈ కేసు అతడి జీవితం, వృత్తి, భవిష్యత్తు అవకాశాలను నాశనం చేస్తుందని న్యాయస్థానానికి వివరించారు.
By November 20, 2020 at 10:16AM
No comments