అసదుద్దీన్ ఓవైసీ ఎఫెక్ట్.. చరిత్రలోనే తొలిసారి.. బిహార్ కేబినెట్ ఇలా..!
బిహార్ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ 125 సీట్లను ఎన్డీయే గెలుపొందడంతో.. నితీశ్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నితీశ్‌తోపాటు 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా నితీశ్ కేబినెట్లో మైనార్టీలకు చోటు దక్కలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. ముస్లిం వర్గానికి మంత్రి పదవి దక్కకపోవడం బిహార్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి బీజేపీ, హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం), వికాస్ శీల్ ఇన్‌సాన్ పార్టీ (వీఐపీ) ముస్లింలకు సీట్లు కేటాయించలేదు. నితీశ్ నాయకత్వంలోని జేడీయూ తరఫున 115 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. అందులో 11 మంది ముస్లింలు ఉన్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆర్జేడీ ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. కానీ ఈ ప్రాంతంలో ఐదు చోట్ల అసదుద్దీన్ ఓవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. గతంలో నితీశ్ కేబినెట్‌లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసిన ఖుర్షీద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ కూడా ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. 2015 ఎన్నికల్లో బిహార్ అసెంబ్లీకి 24 మంది ముస్లింలు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా.. ప్రస్తుతం అది 19కి పడిపోయింది. బిహార్ జనాభాలో దాదాపు 17 శాతం ముస్లింలు ఉంటారు. గత 15 ఏళ్లుగా నితీశ్ కుమార్ ముస్లింల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని.. కానీ తమ పార్టీ తరఫున పోటీ చేసిన 11 మంది ముస్లింలకు సైతం ఆ వర్గం మద్దతుగా నిలవలేదని.. బిహార్ మంత్రివర్గంలో ముస్లింలకు చోటు దక్కకపోవడానికి ముస్లింలే కారణమని జేడీయూ మైనార్టీ సెల్ అధ్యక్షుడు తన్వీర్ అక్తర్ తెలిపారు.
By November 18, 2020 at 11:22AM
No comments