వైట్‌హౌస్‌ను వీడుతా.. కానీ ఆ షరతుకు లోబడే: ట్రంప్ సన్నాయి నొక్కులు
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేది లేదంటూ మొండి వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు .. బెట్టు సడలించి ఓ మెట్టు దిగారు. ఎట్టకేలకు జో బైడైన్ విజయాన్ని అంగీకరించిన ఆయన.. అధికార నివాసం వైట్ హౌస్‌ను వదిలి వెళ్లేందుకు అంగీకరించారు. అయితే, దీనికి ఓ షరతు ఉందంటూ మరో మెలిక పెట్టారు. బైడెన్ గెలిచినట్టు అధికారికంగా ధ్రువీకరణ అయితే తాను శ్వేతసౌధం వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. అమెరికా రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ పదే పదే ఆరోపణలు చేస్తూ ఓటమిని ఒప్పుకోని విషయం తెలిసిందే. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఓట్లను మాయం చేశారని, పోస్టల్ బ్యాలెట్లు చెల్లవంటూ వితండవాదనతో న్యాయస్థానం తలుపుతట్టారు. అయితే, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలే కావడంతో కోర్టులో ఆయనకు చుక్కెదురయ్యింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కాస్త మెత్తబడినట్టే కనబడుతోంది. బైడెన్ విజయానన్ి ఎలక్టోరల్ కాలేజీ ధ్రువీకరిస్తే అధికార పీఠాన్ని వదిలేస్తారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ‘తప్పకుండా అలాగే చేస్తాను.. ఆ సంగతి మీకు తెలుసు కదా’ అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 306, ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబరు 14న జరిగే సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ బృందం అధికారికంగా నిర్ణయిస్తుంది. చట్టసభ సభ్యులు బైడెన్ విజయాన్ని ఆమోదిస్తే వారు పెద్ద తప్పు చేసినట్టే అవుతుందని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఓటమిని ఒప్పుకోవటం చాలా కష్టంగా ఉందని వాపోయారు. అధికారంపై పూర్తిగా ఆశలు కోల్పోని ట్రంప్.. ఏదో జరిగిపోతుందని ఊహించుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం చేయాల్సిన జనవరి 20కి మధ్య ఏదైనా జరగొచ్చంటూ వేదాంతం వళ్లించారు. అంతేకాదు, ఎన్నికలే పెద్ద మోసమని, ఇక్కడ నూటికి నూరుపాళ్లు రిగ్గింగ్ జరిగిందంటూ మరోసారి తనదైన శైలిలో విమర్శించారు. అమెరికా ఎన్నికల విధానం వెనుకబడిన దేశాల్లో మాదిరిగా ఉందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో వంద శాతం రిగ్గింగ్ జరిగిందని రెండు రోజుల కిందట ట్విట్టర్‌లో పేర్కొన్న ట్రంప్.. ఎన్నికలను తిప్పికొట్టాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ మాత్రం ఎన్నికల ఫలితాన్ని నియంత్రించే ప్రయత్నాలకు అమెరికన్లు మద్దతు ఇవ్వరని, తీవ్రతరం అవుతున్న కరోనా మహమ్మారిపై పోరాడటానికి అమెరికన్లు ఐక్యంగా ఉండాలని కోరారు.
By November 28, 2020 at 08:39AM
No comments