సీఎం పొలిటికల్ సెక్రెటరీ సంతోష్ ఆత్మహత్యాయత్నం.. కారణం ఇదేనా!
ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కర్ణాటకలో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎన్‌ఆర్ సంతోష్ తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేశారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం నిద్రమాత్రలు మింగిన సంతోష్ బలవన్మరణానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటీన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంతోష్‌ను రామయ్య మెమోరియల్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే, సంతోష్ ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంతోష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎంత మోతాదులో తీసుకున్నారో తెలియదని పేర్కొన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రి వర్గాలు మాత్రం దీనిపై స్పందించడంలేదన్నారు. కాగా, తన రాజకీయ కార్యదర్శి ఆత్యహత్యాయత్నం చేయడంపై సీఎం యడియూరప్ప స్పందించారు. సంతోష్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ప్రకటించారు. ఆయన ఎందుకు అలాంటి ప్రయత్నం చేశారో తనకూ తెలియదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సంతోష్ కోలుకున్నారని, ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్‌ను సీఎం పరామర్శించారు. యడియూరప్ప బంధువైన సంతోష్ కొద్ది రోజులుగా ఆందోళనలో ఉన్నారని.. సీఎం, ఆయన కుటుంబంతో అయకున్న సంబంధాల గురించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మేలో సీఎం రాజకీయ కార్యదర్శిగా నియమితులైన సంతోష్.. గతంలో జేడీ(ఎస్)- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించారు.
By November 28, 2020 at 11:17AM
No comments