కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ముష్కరులు హతం
జమ్మూ కశ్మీరులో సైన్యం, ఉగ్రవాదుల మధ్య మరోసారి భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం నగరోటా జిల్లా బన్ టోల్ లాజా వద్ద జరిగిన ఎన్‌కౌంటరులో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు ఉగ్రవాదులు బస్సులో వెళుతుండగా నగరోటా జిల్లా వద్ద సైన్యం నిర్బంధ తనిఖీలు చేపట్టింది. బాన్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిని మూసివేసి తనిఖీలు చేస్తుండగా జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో నగ్రోటా చెక్‌పోస్ట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ఇదిలా ఉండగా.. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రనెడ్ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రనేడి దాడికి పాల్పడగా.. అదృష్టవశాత్తూ జవాన్లకు ప్రమాదం తప్పింది. అయితే, ఆ గ్రనేడి వల్ల పౌరులు గాయపడ్డారు. దీంతో పుల్వామాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.
By November 19, 2020 at 09:28AM
No comments