Breaking News

ఫైజర్‌తో త్వరలో కేంద్రం చర్చలు.. భారత్‌లో అందుబాటులోకి వ్యాక్సిన్


అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మన్ బయోటెక్ సంస్థ బయో‌ఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వెల్లడి కాగా... 90 శాతం సమర్ధంగా పనిచేసినట్టు తేలినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. వ్యాక్సిన్‌పై చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఫైజర్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించినప్పటికీ భారత్‌లో అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టతలేదు. క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 40వేల మంది పాల్గొనగా ఇప్పటి వరకు కేవలం 94 మంది మధ్యంతర ఫలితాలను మాత్రమే ఫైజర్ విడుదల చేసింది. సమర్ధత, భద్రతకు సంబంధించిన మరింత డేటాను ఫైజర్ రెండు నెలల్లో ప్రకటించనుంది.. దీంతో వృద్ధులు, తీవ్రత ఎక్కువ కరోనా రోగులపై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందనే అంశంపై మరింత స్పష్టత వస్తుంది. వృద్ధులు, వైరస్ తీవ్రత ఎక్కువ కరోనా రోగులపై ఎంత వరకు సమర్ధవంతంగా పనిచేస్తుందనే అంశంపై ప్రస్తుత ఫలితాలు స్పష్టతనివ్వలేదు. అత్యవసర కేసుల్లో వినియోగానికి అనుమతి కోసం యూఎస్ రెగ్యులేటరీకి ఫైజర్ దరఖాస్తు చేయనుంది. ఈ అంశంపై నవంబరు మూడో వారంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది కేవలం 50 మిలియన్ డోస్‌లు మాత్రమే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలకు సరఫరా చేయడానికి ఫైజర్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు ఫైజర్‌తో భారత్ ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. భారత రెగ్యులేటరీ ప్రకారం.. దేశంలో టీకా అందుబాటులోకి తేవడానికి ముందు స్థానికంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాదు, టీకాను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రత పరచాల్సి ఉంటుందని, భారత్‌లో అటువంటి స్టోరేజీ వసతులు లేవని వ్యాక్సిన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘ఈ ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌కు అల్ట్రాకోల్డ్ స్టోరేజ్ అవసరం.. బయోఎంటెక్ ధర గురించి ఖచ్చితంగా తెలియదు.. కానీ మోడెర్నా డోస్ ధర 37 డాలర్లు.. ఈ టీకాలను తక్కువ మౌలిక వసతులున్న దేశాలకు పంపడం ఖర్చుతో కూడుకున్నది’ అని వెల్లూరులోని సీఎంసీ మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్, టీకా శాస్త్రవేత్త ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్‌పై ఫైజర్ సంస్థతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం మంగళవారం తెలిపింది. టీకా ఉత్పత్తి చేస్తున్న అంతర్జాతీయ, దేశీయ సంస్థలతో వ్యాక్సిన్ కోసం ఏర్పాటైన జాతీయస్థాయి నిపుణుల బృందం సంప్రదింపులు జరుపుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు. అన్ని వ్యాక్సిన్‌లకు రెగ్యులేటరీ ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అలాగే వాటి స్టోరేజీ విషయంపై కూడా దృష్టిపెట్టామని అన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ ఏడాదిలో 50 మిలియన్ డోస్‌లు, వచ్చే ఏడాదికి 1.3 బిలియన్ డోస్‌లను ఉత్పత్తి చేస్తామని భావిస్తున్నట్టు ఫైజర్ తెలిపింది. మా వ్యాక్సిన్ విజయవంతమైతే వివిధ దేశాల్లో సరఫరాకు ఒప్పందం చేసుకుంటామని స్పష్టం చేసింది. ప్రాధాన్యత సమూహాల అత్యవసర వినియోగానికి ఆయా ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.


By November 11, 2020 at 08:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-pfizer-centre-open-to-talks-to-make-covid-vaccine-available-in-india/articleshow/79162965.cms

No comments