రోజులో ఓ ఇంటి నుంచి ఒక్కరే బయటకు రావాలి.. అక్కడ ప్రపంచంలోనే అత్యంత కఠిన లాక్‌డౌన్
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌లో ఒకటి దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. వివాహాలు, అంత్యక్రియలు, బహిరంగ వ్యాయామం, కుక్కలను బయటకు తీసుకురావడం.. ఇలా ప్రతి కదలికపై నిషేధం విధించారు. ఈ కఠిన నిబంధనలు ఆరు రోజులపాటు అమల్లో ఉండనున్నాయి. అత్యవసరమైతే తప్ప రోజులో ప్రతి ఇంటి నుంచి ఒక్కరే బయటకు రావాలని హుకుం జారీచేసింది. విద్యా సంస్థలు, స్కూల్స్, యూనివర్సిటీలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు అన్నీ మూసే ఉంచాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం తెగేసి చెప్పింది. కరోనా వైరస్ క్లస్టర్లను నియంత్రించాలనే లక్ష్యంతో ఇటువంటి కఠిన ఆంక్షలను అమలుచేస్తున్నామని దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ స్టీవెన్ మార్షల్ వెల్లడించారు. ‘వీలైనంత త్వరగా బయటపడటానికి, మందుగానే, చాలా కఠినంగా ఉండాలనుకుంటున్నాం’ అని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్ చేసే దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని అడిలైడ్‌లోని ఓ హోటల్‌లో సహాయకుడు వైరస్ బారినపడిన తరవాత మరో 23 మంది కరోనా సోకింది. దీంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. అంతేకాదు, కరోనా బారినపడిన వారిలో ఎటువంటి లక్షణాలు బయటపడకపోవడం ఆందోళనకరమని మార్షల్ వ్యాఖ్యానించారు. ఉపరితలం నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఇంక్యుబేషన్ పీరియడ్ 24 గంటలు తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కొద్ది నెలల కిందటే ఆస్ట్రేలియా వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో 17 లక్షల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో వైరస్ సామూహిక వ్యాప్తిని నియంత్రించగలిగారు. కాగా, ఇటీవల పొరుగు రాష్ట్రం విక్టోరియాలో మహమ్మారి విజృంభించడంతో మెల్‌బోర్న్‌లో మూడు నెలలపాటు కఠిన లాక్‌డౌన్ విధించారు. ఆగస్టులో 700 కేసులు నమోదైన ఆ ప్రాంతంలో ఇప్పుడు 20 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కావడంలేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ ఆస్ట్రేలియా కఠిన లాక్‌డౌన్‌వైపు మొగ్గు చూపింది.
By November 20, 2020 at 06:56AM
No comments